మహారాష్ట్ర రాజకీయం రోజుకొక కొత్త మలుపు తిరుగుతోంది.  తాజాగా రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌ సీఎం పదవికి రాజీనామా చేశారు. ఈరోజు అర్థరాత్రికి అసెంబ్లీ పదవీ కాలం ముగియనున్న నేపథ్యంలో ఫడ్నవిస్‌ రాజీనామా చేశారు. ఈమేరకు మంత్రులు, బీజేపీ సీనియర్‌ నేతలతో పాటు శుక్రవారం రాజ్‌భవన్‌ గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారిని కలిసి తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు. 


అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి సంపూర్ణ మెజార్టీ రాని విషయం తెలిసిందే. శివసేన-బీజేపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావించినా.. వారిద్దరి మధ్య చర్చలు కొలిక్కిరాలేదు. దీంతో 15  రోజులుగా ప్రతిష్టంభన కొనసాగుతోంది. మరోవైపు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అతిపెద్ద పార్టీగా భాజపా (105) అవతరించినప్పటికీ గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారీ ప్రభుత్వ ఏర్పాటుకు ఎందుకు ఆహ్వానించడం లేదో తనకు అర్థం కావడం లేదని ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ అన్నారు. కేంద్రమంత్రి రామ్‌దాస్‌ అఠవాలేతో భేటీ అనంతరం పవార్‌ మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ ఏర్పాటులో నెలకొన్న సందిగ్ధతపై అఠవాలే తనను సలహా కోరారని పవార్‌ మీడియాకు వివరించారు. భాజపా-శివసేకు ప్రజలు పూర్తి మెజారిటీ ఇచ్చారని, వారి తీర్పును గౌరవించి ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సి ఉందని అఠవాలేకు చెప్పినట్లు వివరించారు.


ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించకుండా గవర్నర్‌ ఇంకా ఎంతకాలం వేచిచూస్తారని, త్వరలోనే ఓ నిర్ణయం వెలువడుతుందని తాను ఆశిస్తున్నట్లు చెప్పారు. ఇక  మహారాష్ట్రలో బీజేపీ మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలు లేకుండా చేస్తామని కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ హుసేన్‌ దల్వాయి అన్నారు. ఈ నేపథ్యంలో గవర్నర్‌ తదుపరి నిర్ణయం ఏంటన్నది ఉత్కంఠగా మారింది. ఇటీవల విడుదలైన ఎన్నికల ఫలితాల్లో అతి పెద్ద పార్టీగా అతవరించిన బీజేపీకి అవకాశం కల్పిస్తారా? లేక రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేస్తారా అనేది ఆసక్తికరంగా మారింది.


మరింత సమాచారం తెలుసుకోండి: