మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి పదవికి దేవేంద్ర ఫడ్నవీస్ రాజీనామా చేశారు. మధ్యాహ్నం బీజేపీ సీనియర్‌ మంత్రులతో కలిసి రాజ్‌భవన్‌కు వెళ్లిన ఆయన గవర్నర్‌ భగత్‌ సింగ్‌ కోశ్యారీకి రాజీనామా పత్రం సమర్పించారు. గవర్నర్‌ తన రాజీనామాను ఆమోదించినట్టుగా ఫడ్నవీస్ ప్రకటించారు. ఈ ఐదేళ్లలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నామన్న ఆయన సహకరించిన పార్టీ సహచరులకు, శివసేన నేతలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. 


ప్రస్తుత మహారాష్ట్ర అసెంబ్లీ గడువు ఈ రోజు అర్ధరాత్రితో ముగియనుంది. మరోవైపు కొత్త ప్రభుత్వం ఏర్పాటులో ఇంకా సందిగ్ధం కొనసాగుతోంది. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించే అవకాశమున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. మిత్ర పక్షాలైన బీజేపీ, శివసేన కూటమి స్పష్టమైన మెజారిటీతో విజయం సాధించినా, అధికార పీఠం విషయంలో ఇరు వర్గాల మధ్య విభేదాలు తలెత్తిన సంగతి అందరికీ తెలిసిందే. ముఖ్యమంత్రి పదవిని చెరి సగం కాలం పంచుకోవాలనే శివసేన డిమాండ్‌కు బీజేపీ అంగీకరించలేదు.  ఈ సారి కూడా పూర్తి కాలం తానే ముఖ్యమంత్రిగా కొనసాగుతానని ఫడ్నవీస్ గతంలో స్పష్టం చేశారు. శివసేనకు ఉప ముఖ్యమంత్రి పదవి, కీలక మంత్రి పదవులు ఇస్తామని కూడా హామీ ఇచ్చారు. అయినా శివసేన 50:50 ఫార్ములాకు కట్టుబడి ఉంది. 


అక్టోబరు 24న విడుదలైన ఎన్నికల ఫలితాల్లో భాజపా 105 సీట్లు గెల్చుకున్న సంగతి తెలిసిందే. శివసేన 56, ఎన్సీపీ 54, కాంగ్రెస్‌ 44 సీట్లు గెల్చుకున్నాయి. మిగిలిన స్థానాల్లో ఇతర పార్టీలు, స్వతంత్రులు గెలుపొందారు.


ఇదిలా ఉంటే శివసేన మాత్రం బెట్టువీడటం లేదు. తమ పార్టీ ఎమ్మెల్యేలను ఇప్పటికే హోటల్స్ కు తరలించింది. అక్కడ వారికి సపర్యలు చేసుకుంటూ కంటికి రెప్పలా కాపాడుకుంటోంది. ఎక్కడ తమ పార్టీ ఎమ్మెల్యేలకు గాలం వేస్తారోనని గట్టిగా జాగ్రత్తలు తీసుకుంటోంది. అసలు విషయానికి వస్తే ఈ అర్ధరాత్రికే ప్రభుత్వ ఏర్పాటుపై గడువు ముగియనుండటంతో అంతా సందిగ్ధత నెలకొంది. ఇన్నాళ్లు ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో.. ఎవరి పంతాన వారు పోవడంతో ఇక రాష్ట్రపతి పాలనే శరణ్యం అన్నట్టుగా మహారాష్ట్ర రాజకీయాలు సాగుతున్నాయి.  



మరింత సమాచారం తెలుసుకోండి: