అబ్దుల్లాపూర్‌మెట్ త‌హ‌శీల్దార్ విజయారెడ్డి దారుణ హ‌త్య నేప‌థ్యంలో...సోష‌ల్ మీడియాలో విమ‌ర్శ‌లు...ప్ర‌తివిమ‌ర్శ‌ల ప‌ర్వం కొనసాగుతున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌ధానంగా రెవెన్యూ ఉద్యోగుల తీరును పేర్కొంటూ...ప‌లువురు ఘాటుగా విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో....తెలంగాణ రెవెన్యూ జేఏసీ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.  త‌మపై సోష‌ల్ మీడియాలో విద్వేష‌పూరిత‌ ప్ర‌చారాన్ని నియంత్రించండి అని పోలీసుల‌ను ఆశ్ర‌యించింది. ఈ మేర‌కు శుక్ర‌వారం రాష్ట్ర అడిష‌న‌ల్ డీజీపీ జితేంద‌ర్‌ను క‌లిసిన జేఏసీ నేత‌లము విన‌తిప‌త్రాన్ని స‌మ‌ర్పించాము. ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కార్యాల‌యంలోనూ విన‌తిప‌త్రాన్ని అంద‌జేశాయి.


ఈ మేర‌కు త‌మ ఫిర్యాదు గురించి రెవెన్యూ జేఏసీ ఓ ప‌త్రికా ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. ఇటీవ‌ల రెవెన్యూ ఉద్యోగుల‌కు వ్య‌తిరేకంగా కొంద‌రు ప‌నిగ‌ట్టుకొని త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్నార‌ని జేఏసీ ఈ ఫిర్యాదులో పేర్కొంది. రెవెన్యూ ఉద్యోగుల‌పై దాడుల‌ను ప్రోత్స‌హిస్తూ సోష‌ల్ మీడియాలో జ‌రుగుతున్న విద్వేష‌పూరిత‌ ప్ర‌చారాన్ని వెంట‌నే నియంత్రించి, ఈ ప్ర‌చారం చేసే వారి ప‌ట్ల క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని తెలంగాణ రెవెన్యూ జేఏసీ కోరింది.``రెవెన్యూ ఉద్యోగుల‌పై దాడులు చేయాల‌ని రెచ్చ‌గొడుతున్నార‌ని, హ‌త్య‌ల‌కు ప్రోత్స‌హిస్తున్నట్లు వారి దృష్టికి తీసుకెళ్లాము. ఇటువంటి వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని, లోక‌పోతే త‌హ‌శీల్దార్ విజ‌యారెడ్డి హ‌త్య వంటి దారుణ ఘ‌ట‌న‌లు పున‌రావృతం అయ్యే ప్ర‌మాదం ఉంద‌ని విన్న‌వించాము. త‌హ‌శీల్దార్ విజ‌యారెడ్డి హ‌త్య ఘ‌ట‌న త‌ర్వాత రాష్ట్ర‌వ్యాప్తంగా రెవెన్యూ ఉద్యోగుల్లో భ‌యాందోళ‌న‌లు నెల‌కొన్నాయ‌ని, కావున అన్ని త‌హ‌శీల్దార్ కార్యాల‌యాల్లో త‌గినంత పోలీస్ బందోబ‌స్తు ఏర్పాటు చేసి రెవెన్యూ ఉద్యోగుల భ‌ద్ర‌త‌కు భ‌రోసా క‌ల్పించాల‌ని కోరాము. భ‌విష్య‌త్‌లో ఎప్పుడూ ఇలాంటి సంఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌కుండా చూడాల‌ని విన‌వించడం జ‌రిగింది.`` అని పేర్కొంది.


విజ‌యారెడ్డి హ‌త్య ఘ‌ట‌న‌పై స‌మ‌గ్ర విచార‌ణ జ‌రిపించి నిందితుడి వెనుక ఉన్న వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరిన‌ట్లు జేఏసీ తెలిపింది. ``విజ‌యారెడ్డిని అత్యంత దారుణంగా హ‌త్య చేసిన నిందితుడి వెనుక ఇంకా ఎవ‌రైనా హ‌స్తం ఉండి ఉండొచ్చ‌ని తాము అనుమానిస్తున్న‌ట్లు తెలియ‌జేశాం. ఈ ఘ‌ట‌న‌పై స‌మ‌గ్ర విచార‌ణ జ‌రిపి దోషుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని, ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా వేగంగా న్యాయం జ‌రిగేలా చూడాల‌ని కోర‌డం జ‌రిగింది `` అని పేర్కొన్నారు. ఈ మేర‌కు  వి.ల‌చ్చిరెడ్డి, అధ్య‌క్షులు, డిప్యూటీ క‌లెక్ట‌ర్స్ అసోసియేష‌న్‌, ఎస్.రాములు, అధ్య‌క్షులు, టీజీటీఏ, గ‌రికె ఉపేంద‌ర్‌రావు, అధ్య‌క్షులు, టి.వి.ఆర్.ఒ.డ‌బ్లూ.ఏ, సుధాక‌ర్‌రావు, ప్ర‌ధాన‌కార్య‌ద‌ర్శి, టి.వి.ఆర్.ఒ.డ‌బ్లూ.ఏ, ఎన్‌.ల‌క్ష్మీనారాయ‌ణ‌, అధ్య‌క్షులు, టి.వి.ఆర్‌.ఓ.ఏ, బి.సుదర్శ‌న్‌, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, టి.వి.ఆర్‌.ఓ.ఏ, ఏ.బాల‌న‌ర్స‌య్య‌, అధ్య‌క్షులు, టి.ఎస్‌.వి.ఆర్‌.ఏ
వంగూరు రాములు, అధ్య‌క్షులు, టి.ఎస్‌.వి.ఆర్‌.ఏ, పేరుతో ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది.


మరింత సమాచారం తెలుసుకోండి: