తమిళ తళైవా రజినీకాంత్ బీజేపీలో చేరనున్నాడనే ఊహాగానాలకు చెక్ పడింది. తాను బీజేపీ ట్రాప్‌లో పడబోననీ.. తిరువల్లూరుకు కాషాయ రంగు పులమొద్దని సంచలన వ్యాఖ్యలు చేశారు తళైవా. దీంతో తమిళ రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి రాజుకుంది. 


సూపర్ స్టార్ రజినీకాంత్ బీజేపీలో చేరనున్నారని కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో మోత మోగుతోంది. రజినీ వస్తారని 2021 ఎన్నికల్లో బీజేపీ పార్టీ తమిళనాట అధికారంలోకి వస్తుందని బీజేపీ సోషల్ మీడియా విభాగం తెగ ప్రచారాలు చేస్తోంది. అయితే ఊహాగానాలకు చెక్ పెడతూ రజినీ కీలక వ్యాఖ్యలు చేశారు. గురువు కె.బాలచందర్‌ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న రజినీ.. బీజేపీలో చేరడంపై వస్తున్న ఊహాగాలను ఖండించారు. తాను బీజేపీకి చెందిన వ్యక్తి అంటూ కొందరు ప్రచారం చేస్తున్నారనీ.. అది వాస్తవం కాదని రజినీ స్పష్టంచేశారు. ఇటీవల రాష్ట్ర బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి పోన్‌ రాధాకృష్ణన్‌తో భేటీపైనా స్పందించారు. ఆయన తనను బీజేపీలోకి రావాలని ఆహ్వానించలేదన్నారు. 


తమిళ ప్రాచీన కవి తిరువల్లూరు నుదుటికి, భుజాలకు విభూతి, బొట్లు.. మెడలో రుద్రాక్ష దండతో ఉన్న ఫొటోను ఇటీవల బీజేపీ తమిళనాడు విభాగం ట్విటర్‌లో పోస్ట్‌ చేయడంతో చెలరేగిన వివాదంపై రజినీ సీరియస్ అయ్యారు. తిరువల్లూర్‌తో పాటు తనపైనా బీజేపీ కాషాయ రంగు పులమాలని ప్రయత్నిస్తున్నారంటూ ఘూటుగానే స్పందించారు. కానీ తాను మాత్రం బీజేపీ ట్రాప్‌లో పడబోననని స్పష్టంచేశారు. తమిళనాట నాయకత్వ శూన్యత ఉందని, తాను రాజకీయ పార్టీ ప్రారంభించేంత వరకూ సినిమాల్లో నటిస్తూనే ఉంటానన్నారు. మరికొద్దిరోజుల్లో వెలువడనున్న అయోధ్య తీర్పు ఎవరికి అనుకూలంగా వచ్చిన శాంతియుతంగా ఉండాలని, కోర్టు తీర్పులను గౌరవించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు రజినీ. మొత్తానికి రజినీ కాంత్ భారతీయ జనతా పార్టీపై తనకున్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దీంతో ఆయనపై పుకార్లు సృష్టించే వారికి అడ్డుకట్టే పడినట్టయింది.




మరింత సమాచారం తెలుసుకోండి: