ఆర్టీసీ సమ్మె నేపధ్యంలో కార్మికులకు, ఉద్యోగులకు కేసియార్ షాక్ ఇద్దామని అనుకుంటే చివరకు కేంద్రమే సిఎంకు పెద్ద షాక్ ఇచ్చింది.  సమ్మె చట్ట విరుద్ధమని ఏ ముహూర్తంలో కేసియార్ ప్రకటించారో కానీ చివరకు ఆర్టీసీ సంస్ధ ఏర్పాటే చట్టబద్దం కాదని కేంద్రం తేల్చి చెప్పేసింది.  తమ డిమాండ్ల సాధన కోసం సమ్మె చేయటం ఏ సంస్ధలోని యూనియన్లకైనా చట్టబద్ధంగా సంక్రమించిన హక్కు.

 

ఆ హక్కు ప్రకారం ఆర్టీసీలోని యూనియన్లు ముందుగా నోటిసిచ్చి సమ్మె మొదలుపెడితే కేసియార్ సమ్మెను గుర్తించటానికి నిరాకరించారు. బెదిరించి యూనియన్ నేతలను దారికి తెచ్చుకోవాలన్న సిఎం ప్లాన్ చివరకు  బెడిసికొట్టింది. చిలికి చిలికి గాలివాన లాగ తయారైన ఆర్టీసీ సమ్మె కోర్టు జోక్యంతో కీలక మలుపు తిరిగింది.

 

ఉద్యోగులు, కార్మికులను సెల్ఫ్ డిస్మిస్ అని ప్రకటించారు. సమ్మె విరమణకు కోర్టు సూచనలు చేసినా పట్టించుకోలేదు. ఏరోజుకారోజు కోర్టును అయోమయానికి గురిచేయటంలో భాగంగా తప్పుడు నివేదికలను ఇచ్చినందుకు చివరకు ప్రధాన కార్యదర్శి, రవాణాశాఖ కార్యదర్శి, ఆర్టీసీ ఎండి కోర్టులో నిలబడాల్సొచ్చింది.

 

అదే సమయంలో కోర్టు నోటీసులకు స్పందించిన కేంద్రప్రభుత్వం అసలు టిఎస్ఆర్టీసీ ఏర్పాటే చట్టవిరుద్ధంగా జరిగిందని చెప్పటం సంచలనం కలిగించింది. అంటే కేంద్రం లెక్క ప్రకారం అసలు తెలంగాణా ఆర్టీసీ ఏర్పాటే చట్టవిరుద్ధమని తేలిపోయింది. విభజన చట్టం ప్రకారం ఏపిఎస్ఆర్టీసీ విభజన జరగలేదు కాబట్టి తెలంగాణా ఆర్టీసీ విషయంలో కేసియార్ తీసుకున్న ఏ నిర్ణయం కూడా చెల్లదని తేలిపోయింది.

 

ఈ నేపధ్యంలోనే ఆర్టీసీలో  ప్రైవేటు బస్సులను  తీసుకోవటం, 5100 రూట్లను ప్రైవేటు పరం చేయటం లాంటి కేసియార్ నిర్ణయాలు కూడా చెల్లదు. మొత్తం మీద అన్నీ యాంగిల్స్ లోను కేసియార్ ఇరుక్కుపోయినట్లయిపోయింది. ఇటు ఉద్యోగులు, కార్మికులు తన మాట లెక్క చేయక, కోర్టులోను బాగా అక్షింతలు పడి, కేంద్రం కూడా ప్రభుత్వం నిర్ణయాలు చెల్లవని తేల్చేయటంతో కేసియార్ కు షాక్ తగిలినట్లైంది.

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: