గాంధీ కుటుంబానికి కేంద్రం షాకిచ్చింది. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక వాద్రా కుటుంబానికి  స్పెషల్ ప్రొటక్షన్ గ్రూప్-ఎస్.పి.జి భద్రతను తొలగించాలని నిర్ణయం తీసుకుంది. జడ్ ప్లస్ కేటగిరి భద్రతను మాత్రమే కొనసాగిస్తోంది.  దీంతో దేశంలో ప్రధాని, రాష్ట్రపతికి మాత్రమే ఎస్‌.పి.జి భద్రత ఉన్నట్టయింది. దీనిపై కాంగ్రెస్ ఘాటుగా స్పందించింది.


దేశ రాజకీయాల్లో తమదైన ముద్ర వేసుకున్న గాంధీ కుటుంబానికి భారీ ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, ప్రియాంకలకు ప్రస్తుతం కల్పిస్తున్న స్పెషల్‌ ప్రొటెక్షన్‌ గ్రూప్‌ను ఉపసంహరించుంది. వీరి భద్రతకు ఎలాంటి ముప్పు లేదని భావిస్తోన్న కేంద్రం.. ఎస్.పి.జిని తొలగించి జడ్‌ప్లస్‌ భద్రతను మాత్రమే కొనసాగించాలని నిర్ణయించింది. ఎస్.పి.జి భద్రతను కేవలం రాష్ట్రపతి, దేశ ప్రధానికి మాత్రమే కేటాయిస్తారనీ, ఇతర నేతలకు అవసరం లేదని కేంద్రం భావిస్తోంది. ప్రస్తుతం ఉన్న ఎస్.పి.జి చట్టానికి సవరణ చేసే యోచనలో ఉన్న కేంద్ర ప్రభుత్వం, దాని కోసం త్వరలోనే పార్లమెంట్‌లో ప్రత్యేక బిల్లును ప్రవేశపెట్టనుంది.   


1991లో రాజీవ్‌ గాంధీ హత్య ఘటన తర్వాతి నుంచి వీరి కుటుంబానికి ఎస్‌.పి.జి స్థాయి భద్రతను కేటాయించారు. తాజాగా గాంధీ కుటుంబానికి ఎస్‌.పి.జి భద్రత రద్దు నిర్ణయంతో ఆ స్థానంలో దేశంలో వారెక్కడ పర్యటించినా సి.ఆర్.పి.ఎఫ్ భద్రత -జడ్ ప్లస్ సెక్యూరిటీ మాత్రమే ఉంటుంది. సుమారు 100 మంది సి.ఆర్.పి.ఎఫ్ భద్రతా సిబ్బందిని వారి భద్రతకు కేటాయిస్తారు.  


మోడీ ప్రభుత్వం నిర్ణయంపై విపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. కేంద్రం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని విమర్శిస్తున్నాయి.  గాంధీల భద్రత విషయంలో కేంద్రం రాజీ పడుతోందన్నారు. ఈ నిర్ణయంతో వారిని తేలికగా టార్గెట్ చేసే అవకాశాలుంటాయని, వారు ప్రాణాలకు ముప్పు ఉంటుందని  కాంగ్రెస్ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ ఆమె అంగరక్షకుల చేతిలో హత్యకు గురైన తర్వాత... 1988లో ఎస్‌.పి.జిని స్థాపించారు. మాజీ ప్రధానులు, వారి కుటుంబాలకు పదేళ్ల వరకూ ఈ రకమైన భద్రతను కల్పిస్తున్నారు. మాజీ ప్రధాని ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు కూడా ఇటీవల ఎస్.పి.జి భద్రతను కేంద్రం ఉపసంహరించుంది. ప్రస్తుతం ఆయనకు జడ్‌ప్లస్‌ భద్రతను కల్పిస్తున్నారు.  





మరింత సమాచారం తెలుసుకోండి: