ఆర్టీసీ జేఏసీ శనివారం  నిర్వహించ తలపెట్టిన ఛలో ట్యాంక్ బండ్ కార్యక్రమానికి పోలీసులు అనుమతి ని  నిరాకరించారు. ఈ కార్యక్రమానికి  పోలీసులు అనుమతి నిరాకరించినప్పటికీ ,  ఎట్టి పరిస్థితిలో ఛలో  ట్యాంక్ బండ్ కార్యక్రమం నిర్వహించి తీరుతామని ఆర్టీసీ  జేఏసీ నేతలు స్పష్టం చేస్తున్నారు .  శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తామని  చెప్పినా కూడా, పోలీసులు అనుమతి నిరాకరించడం హాస్యాస్పదంగా ఉందని వారు మండిపడ్డారు . ఛలో  ట్యాంక్ బండ్ కార్యక్రమ నేపధ్యం లో ఆర్టీసీ  కార్మికులను ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నారని, అరెస్టు చేసిన కార్మికులను తక్షణమే విడుదల చేయాలని ఆర్టీసీ జేఏసీ నేతలు  డిమాండ్ చేశారు .


  ట్యాంక్ బండ్ పై  సభ నిర్వహణ కు  అనుమతి ఇవ్వాలని హైదరాబాద్ పోలీసు కమిషనర్ కోరితే, కనీసం కారణం చెప్పకుండా  నిరాకరించడం చూస్తే మనం ప్రజాస్వామ్యం లో ఉన్నామా ?, రాచరిక వ్యవస్థలో ఉన్నామో తెలియడం లేదంటూ  ఆర్టీసీ జేఏసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  ఆర్టీసీ జేఏసీ నేతలు తలపెట్టిన చలో ట్యాంక్ బండ్ కార్యక్రమ  నేపథ్యంలో కార్మికులను పోలీసులు ముందస్తుగానే ఎక్కడిక్కడ  అదుపులోకి తీసుకొని సమీప పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు.  చలో ట్యాంక్ బండ్ కార్యక్రమానికి టీఆర్ఎస్ మినహా అన్ని రాజకీయ పక్షాలు,  ప్రజా సంఘాలు మద్దతు ప్రకటించాయి .


తమ న్యాయమైన డిమాండ్ల కోసం ఆర్టీసీ కార్మికులు చేస్తున్న పోరాటానికి కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు తెలుపుతోందని  టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.  శనివారం ఆర్టీసీ జెఎసి  నిర్వహించ తలపెట్టిన ఛలో  ట్యాంక్ బండ్ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని అయన పిలుపునిచ్చారు .  ఇక ఈ  కార్యక్రమానికి భారతీయ జనతాపార్టీ  (బీజేపీ ) కూడా తన  సంపూర్ణ మద్దతు ప్రకటించింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: