ఏపీ సీఎం వైఎస్ జగన్ ఇటీవల ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో వచ్చే ఏడాది నుంచి ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడుతున్నారు. అంటే ఇక తెలుగు మీడియం అనేది ఉండదన్నమాట. కాకపోతే.. అన్ని తరగతుల్లోనూ తెలుగు ఒక సబ్జక్టుగా తప్పనిసరిగా ఉంటుంది. ఈ నిర్ణయాన్ని విపక్షాలతో పాటు కొన్ని పత్రికలు తప్పుబడుతున్నాయి.


ఈ నిర్ణయం వల్ల తెలుగు రాష్ట్రంలో తెలుగు ఉనికి పోతోందని గగ్గోలు పెడుతున్నాయి. అయితే పెద్దలు మాత్రమే ఆంగ్లం నేర్చుకోవాలా? పేదలకు అవసరం లేదా అన్న అనుమానాలు జనంలో కలుగుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చే ఏడాది నుంచి ఇంగ్లీష్‌ మీడియం ప్రవేశపెడతామని ప్రభుత్వం ప్రకటించడమే ఆలస్యం..ఇంగ్లీష్‌ ఎందుకు అంటూ తెలుగు భాషపై ఎనలేని ప్రేమను వెల్లబోసుకుంటున్నారు.


అయితే వీరికి నిజంగా తెలుగుపై ప్రేమ ఉంటే తమ బిడ్డలను ఎందుకు తెలుగు మీడియం చదివించలేదన్న ప్రశ్నలు సామాన్య జనం నుంచి వినిపిస్తున్నాయి. వీటిని నేతల వద్ద సమాధానం ఉందా ? పేదవాళ్లు ఇంగ్లీష్‌ మీడియం చదువులు చదువుకోవద్దా అన్న ప్రశ్నలు ఉద్భవిస్తున్నాయి. అందుకే ఒకసారి గణాంకాలు పరిశీలిస్తే..


రాష్ట్రంలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల సంఖ్య మొత్తంగా 70,90,217 మంది విద్యార్థులు అక్టోబర్‌ వరకు నమోదైతే.. వారిలో 44,21,529 మంది అంటే 62.3 శాతం ఆంగ్ల మాధ్యమంలోనే చదువుతున్నారు. సామాజిక వర్గాల వారీగా పరిశీలన చేస్తే ముఖ్యంగా ఎస్టీకి చెందిన విద్యార్థులు 33.23 శాతం, ఎస్సీకి 49.61 శాతం, వెనుబడిన వారు 62.5 శాతం, ఇతర కులాలు 82.6 ఆంగ్ల మాధ్యమంలో చదువుతున్నారు. ఆంగ్ల మాధ్యమంలో స్కూళ్లు అందుబాటులో లేకపోవడం, ఇంగ్లిష్‌ మీడియం స్కూళ్లు కేవలం ధనికులకు మాత్రమే పరిమితమైపోయి.. గ్రామీణ ప్రాంతంలోని ఎస్సీ, ఎస్టీలు వెనబడ్డారని ప్రభుత్వం గుర్తించింది. అందుకే ఈ నిర్ణయం తీసుకుంది. ఇది ఆయావర్గాలకు ఎంతో మేలు చేసే నిర్ణయం.


మరింత సమాచారం తెలుసుకోండి: