వైయస్‌ జగన్‌ ప్రభుత్వం పై అగ్రకులాల కుట్ర జరుగుతుందని అంటున్నారు వైసీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ పండుల రవీంద్రబాబు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సీఎం పెద్దపీట వేస్తున్నారని ధనిక పార్టీలైన బీజేపీ, టీడీపీలు వక్రీకరిస్తున్నాయన్నాయని ఆయన ఆరోపించారు. దీనికి పచ్చమీడియా విపరీతమైన కాంట్రవర్సీ క్రియేట్‌ చేస్తుందని పండుల రవీంద్రబాబు మండిపడ్డారు.


సీఎం వైయస్‌ జగన్‌ నడిచేటప్పుడు కుడి కాలు ముందుగా ఎందుకు వేశాడనే స్థాయికి టీడీపీ, బీజేపీ, జనసేన వెళ్లిపోయాయని మాజీ ఎంపీ పండుల రవీంద్రబాబు అన్నారు. ప్రభుత్వంలో జరుగుతున్న బదిలీలకు కూడా కులం అనే ట్యాగ్‌ను తగిలించే నీచ స్థితికి దిగజారారన్నారు. సీఎస్‌ ఎల్వీ సుబ్రమణ్యంను బదిలీ చేస్తే దానికి బ్రాహ్మణ కులం పెట్టి విషప్రచారం చేస్తున్నారని మాజీ ఎంపీ పండుల రవీంద్రబాబు అన్నారు.


ఇంగ్లిష్‌ మీడియం కేవలం ధనికులకే పరిమితం అవుతుందని, పేదవారు కూడా ఇంగ్లిష్‌ మీడియంలో చదివితే.. పెద్ద పెద్ద చదువులకు వెళ్లినప్పుడు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో సీఎం వైయస్‌ జగన్‌ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియం ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. సాధారణంగా ఎక్కడకు వెళ్లినా.. ఎవరిని అడిగినా మా అబ్బాయిని ఇంగ్లిష్‌ మీడియం పాఠశాలలో వేశామని చెబుతుంటారు. పేదవారికి ఎండమావిలా తయారైన ఇంగ్లిష్‌ మీడియం చదువును నిజం చేసేందుకు సీఎం నిర్ణయం తీసుకున్నారన్నారు.


దాన్ని కూడా చంద్రబాబు, పవన్, బీజేపీ, పచ్చమీడియా వక్రీకరిస్తున్నాయని మండిపడ్డారు. తెలుగును బ్యాన్‌ చేయలేదని, పదో తరగతి వరకు తెలుగు ఉంటుందన్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఇంగ్లిష్‌ వచ్చా అని వారిని కూడా అవమానించే రీతిలో టీడీపీ, బీజేపీ మాట్లాడుతున్నాయన్నారు. వరదలు రావడం వల్లే ఇసుక కొరత ఏర్పడిందని, పదిహేను రోజుల్లో ఇసుక సమస్య లేకుండా చేస్తామని మాజీ ఎంపీ పండుల రవీంద్ర బాబు అన్నారు. టీడీపీ హయాంలో ఉచితంగా ఇసుక ఇచ్చి ఉంటే ఆధారాలతో సహా చూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని పండుల రవీంద్ర బాబు సవాలు విసిరారు.


మరింత సమాచారం తెలుసుకోండి: