ఏపీ సీఎం జగన్ కు ఇసుక తలనొప్పులు క్రమేపీ తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఇసుక సరఫరా క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం రోజుకు దాదాపు లక్ష టన్నులకు చేరుకుంది. ఈ ఉత్పత్తితో ఇసుక కొరత దాదాపు తగ్గే పరిస్థితి కనిపిస్తోంది. ఇసుక రీచ్‌లలో నీరు పూర్తిగా ఇంకిపోతే ప్రజలు కోరినంత ఇసుకను స్టాక్‌ యార్డుల ద్వారా అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.


ఈనెల 1వ తేదీన 31,576 మెట్రిక్‌ టన్నుల ఇసుక ఉత్పత్తి మాత్రమే ఉంది. ఈ శుక్రవారం ఇది 96,600 టన్నులకు పెరిగింది. అంటే.. ఐదు రోజుల్లో మూడు రెట్లు అధికంగా ఇసుక లభించింది. ఈ నెల 4వ తేదీ నుంచి 8వ తేదీ వరకూ సుమారు 4 లక్షల టన్నుల ఇసుకను ఏపీ ఎండీసీ స్టాక్‌ యార్డులకు చేరవేసిందని అధికారులు చెబుతున్నారు.


దీనికి తూర్పు గోదావరి జిల్లాల్లో తవ్విన ఇసుకను కలిపితే 4.30 లక్షల టన్నుల వరకూ ఉంటుందని ఏపీ మైనింగ్ శాఖ అధికారులు తెలిపారు. మరో పది రోజుల్లో తవ్వకాలను రెట్టింపు చేయడం ద్వారా కోరినంత ఇసుకను ప్రజలకు అందించేందుకు సంసిద్ధంగా ఉన్నామంటున్నారు. ఇదే పరిస్థితి కొనసాగి మరిన్ని రీచ్‌లలో వరద నీరు ఇంకిపోతే రోజుకు రెండు లక్షల టన్నుల ఇసుకను స్టాక్‌ యార్డులకు చేరవేసి ప్రజలకు అందించేందుకు సర్వసన్నద్ధంగా ఉన్నామని ఏపీ ఎండీసీ వైస్‌ చైర్మన్‌ కమ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ మధుసూధన్‌రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.


పెరిగిన ఇసుక సరఫరా ద్వారా జగన్ కు ఇసుక రాజకీయాల నుంచి కాస్త ఉపశమనం కలిగే అవకాశం ఉంది. ఎందుకంటే.. కొన్నిరోజులుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ఇసుక తుపాను కమ్మేసింది. రాష్ట్రంలో ఇసుక బంగారమైపోయిందంటూ ప్రతిపక్షాలు గోల చేస్తున్నాయి. ఇసుక లేక.. ఉపాధి లేక కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని కూడా వార్తలు వచ్చాయి. అటు తెలుగు దేశం, ఇటు జనసేన, ఇంకోవైపు బీజేపీ అన్నీ ఈ ఇసుక సమస్యపై తమదైన శైలిలో పోరాటం చేస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: