దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న అయోధ్య కేసు తీర్పు నేపథ్యంలో కేంద్రం ముందు జాగ్రత్తలు తీసుకుంటోంది. శాంతిభద్రతల సమస్య లేకుండా జాగ్రత్తపడుతోంది. దేశవ్యాప్తంగా హై అలర్ట్‌ ప్రకటించారు. మధ్యప్రదేశ్‌, యూపీ, జమ్ము కశ్మీర్‌, ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాల్లో స్కూళ్లు, కాలేజీలు, విద్యాసంస్థలు మూసివేశారు. యూపీలో ముందుజాగ్రత్త చర్యగా శనివారం నుంచి సోమవారం వరకూ విద్యాసంస్థలను మూసేశారు.


జమ్ము కశ్మీర్‌లో పరీక్షలు వాయిదా వేశారు. శనివారం మద్యం విక్రయాలను నిషేధించారు. గోవా, యూపీ, జమ్ము కశ్మీర్‌ సహా పలు రాష్ట్రాల్లో 144 సెక్షన్‌ విధించారు. భోపాల్‌, బెంగళూర్‌లలో నిషేధాజ్ఞలు విధించారు. దేశ రాజధాని ఢిల్లీలోనూ ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేట్‌ పాఠశాలలకు సెలవు ఇచ్చేశారు.బెంగళూర్‌లో శనివారం ఉదయం ఏడు గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకూ 144 సెక్షన్‌ అమలులో ఉంటుందని పోలీసులు ప్రకటించారు.


హైదరాబాద్‌లోని సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక బలగాలను నియమించారు. హైదరాబాద్‌లో శాంతి భద్రతల పరిస్థితిని అదుపులో ఉంచేందుకు అవసరమైన చర్యలు చేపట్టారు. శాంతి భద్రతలు తలెత్తకుండా ప్రభుత్వాలు అన్ని చర్యలు తీసుకుంటున్నాయి. అందులో భాగంగానే సామాజిక మాధ్యమాలపైనా తీవ్ర నిఘా ఉంటుంది. సామాజిక మాధ్యమాల్లో మీకొచ్చిన సందేశాన్ని మరొకరికి పంపించారంటే కోరి మీరు చిక్కుల్లో పడతారు. కాబట్టి ఈరోజు సోషల్ మీడియాలో ఈ తీర్పుకు సంబంధించి ఎలాంటి పోస్టులు పెట్టకపోవడం.. మీకు వచ్చిన వాటిని ఎవరికీ పంపకపోవడం ఉత్తమం.


పోస్టు మీరు సృష్టించకపోయినా.. మీరు ఫార్వార్డ్ చేసినా.. పోలీసు కేసుల్లో ఇరుక్కునే అవకాశముంది. అయోధ్య తీర్పు నేపథ్యంలో రాష్ట్రాలనూ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అప్రమత్తం చేసింది. ఈనేపథ్యంలో పోలీసు ఉన్నతాధికారులు సమావేశమై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు. సున్నితమైన ప్రాంతాల్లో ఇరుమతాల పెద్దలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. అయోధ్య తీర్పు నేపథ్యంలో సామాజిక మాధ్యమాలపై పోలీసుశాఖ ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించింది. వదంతుల వ్యాప్తి విషయంలో కఠినంగా వ్యవహరిస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: