భారతదేశ అతి పురాతన వివాదం 'అయోధ్య' పై నేడు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీమ్ కోర్టు చారిత్రాత్మక తీర్పు వెలువరించనుంది. అయోధ్యలోని రామ జన్మభూమి-బాబ్రీ మసీదు స్థల వివాదం పై కోర్టుల్లో గత 134 సంవత్సరాలు గా విచారణ నడుస్తూనే ఉంది. అయోధ్యలోని 2.77 ఎకరాల భూమిపై హిందూ, ముస్లిం పక్షాల నడుమ దశాబ్దాలుగా వివాదం నెలకొంది. నేడు ఈ వివాదం పై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ రంజన్‌ గొగొయి నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఉదయం 10.30కు ఈ తీర్పును వెలువరించనుంది. తీర్పు వెలువరించే ఐదుగురు జడ్జీలకు కట్టుదిట్టమైన భద్రతను కల్పించారు. ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ రంజన్‌ గొగొయి జడ్ ప్లస్ భద్రత కల్పించారు. 


అయోధ్య ప్రాంతం వున్న ఉత్తర్‌ప్రదేశ్‌లో భారీగా బలగాలను మోహరించారు. దేశ వ్యాప్తంగా హై అలెర్ట్ ప్రకటించారు. సున్నితమైన ప్రాంతాల్లో ఇంటర్నెట్ ను నిలిపివేయనున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని విద్యా, శిక్షణ సంస్థలకు సోమవారం వరకూ ప్రభుత్వం సెలవులను ప్రకటించింది. కేంద్రం 4వేల పారామిలటరీ బలగాలను పంపింది. దిల్లీ, మధ్యప్రదేశ్‌లో శనివారం పాఠశాలలకు సెలవు ప్రకటించారు. 


"‘సుప్రీంకోర్టు ‘అయోధ్య’ కేసులో ఎలాంటి నిర్ణయాన్ని వెలువరించినా దానిని ఏ ఒక్క వర్గానికో  గెలుపు? లేదా ఓటమి? అనే కోణం నుంచి చూడనే కూడదు. శాంతిసామరస్యాల పరిరక్షణ, సుహృద్భావం అనేది మన సుసంపన్న సంప్రదాయం. అందుకే, ‘అయోధ్య’పై సుప్రీంకోర్టు నిర్ణయం ఈ అత్యున్నత సంప్రదాయాన్ని మరింత పరిపుష్టం చేసేలా చూడటం మనందరి ప్రప్రథమ ప్రాధాన్యం కావాలి.  దేశప్రజలందరికీ అదే నా అభ్యర్థన. తీర్పు అనంతరం కూడా మైత్రి, సయోధ్యలను మనం చక్కగా కాపాడుకోవాలి. సర్వోన్నత న్యాయస్థానంలో ఈ కేసు విచారణ  జరిగినంత కాలం సమాజంలోని అన్ని వర్గాలూ సుహృద్భావ పరిస్థితులు కొనసాగేలా చేసిన కృషి శ్లాఘనీయం అది అభినందనీయం." అని దేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రజలకు సందేశాన్నిచ్చారు.


మరింత సమాచారం తెలుసుకోండి: