చంద్రబాబునాయుడు తాజా వ్యాఖ్యలు చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానం వస్తోంది. చంద్రగిరిలోని 14 నియోజకవర్గాల నేతలతో మూడు రోజులుగా  సమీక్ష జరిపారు. అయితే జగన్ పై అసందర్భమైన వ్యాఖ్యలు చేయటమే ఆశ్చర్యంగా ఉంది. జగన్ హిందువో  లేకపోతే క్రిస్తియన్ ఏదో ఒకటి చెప్పాలంటూ చంద్రబాబు చేసిన డిమాండ్ విచిత్రంగా ఉంది.

 

జగన్ మతానికి సంబంధించిన డిమాండ్ చేయాల్సిన అవసరం చంద్రబాబుకు ఏమొచ్చిందో అర్ధం కావటం లేదు. సోనియాగాంధి, అబ్దుల్ కలాం లాంటి వాళ్ళే తిరుమల ఆలయంలోకి ప్రవేశించేటపుడు డిక్లరేషన్ ఇచ్చారట. అదే విషయాన్ని చంద్రబాబు ప్రస్తావిస్తు సోనియా, కలాం కన్నా జగన్ అతీతుడా ? సంప్రదాయాలు పాటించక్కర్లేదా ? అనే అడ్డుగోలు వాదన వినిపించారు.

 

వైఎస్ కుటుంబం కన్వర్టెడ్  క్రిస్తియన్లన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ కాని ఇపుడు జగన్ కానీ రెగ్యులర్ గా ఆలయాలకు వెళుతునే ఉన్నారు. పైగా తిరుమల శ్రీవారిని వీలైనపుడల్లా దర్శించుకుంటునే ఉంటారన్న విషయం అందరికీ తెలిసిందే. పుట్టి పెరిగిందంతా ఇక్కడే అయినపుడు ఇపుడు కొత్తగా వాళ్ళు డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది ?

 

విదేశాల నుండి వచ్చిన హిందువేతర ప్రముఖులు శ్రీవారిని దర్శించాలంటే డిక్లరేషన్ ఇవ్వాలని అడగటంలో అర్ధముంది. సోనియాగాంధి డిక్లరేషన్ ఇచ్చారంటే ఆమె జన్మతహ ఇటలీకి చెందిన మహిళ.  దివంగత నేత రాజీవ్ గాంధిని వివాహం చేసుకుని భారతీయ మహిళ అయినా తిరుమలకు మాత్రం ఎప్పుడూ రాలేదు. కాబట్టి మొదటిసారి వచ్చినపుడు డిక్లరేషన్ ఇచ్చారంటే అర్ధముంది. అలాగే కలాం కూడా పుట్టి పెరిగిన దగ్గర నుండి ఎప్పుడూ తిరుమలకు వచ్చినట్లు లేదు. అందుకే రాష్ట్రపతి అయిన తర్వాత తిరుమలకు వచ్చినపుడు డిక్లరేషన్ తీసుకున్నారు.

 

కానీ జగన్ విషయం అలా కాదు. పుట్టిన పెరిగిన దగ్గర నుండి ఎన్నోసార్లు తిరుమలకు వచ్చారు. కాబట్టి ఇపుడు కొత్తగా డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ విషయం తెలిసీ చంద్రబాబు కావాలనే జగన్ పై బురద చల్లుతున్నారు. మొత్తం మీద జగన్ హిందు వ్యతిరేకి అనే ముద్ర వేసేందుకే ప్రయత్నిస్తున్నట్లు తెలిసిపోతోంది.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: