భారతదేశంలో జమ్మూ కశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370 కేంద్ర ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయంతో ఆగష్టు నెల 5వ తేదీన రద్దయింది. ఆర్టికల్ 370 రద్దుతో కశ్మీర్ ప్రత్యేక హక్కులను కోల్పోయి కేంద్ర ప్రభుత్వానికి పూర్తి హక్కులు కల్పించబడ్డాయి. నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీఎ ప్రభుత్వం జమ్మూ కశ్మీర్ ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చేసింది. ఈరోజు దశాబ్దాల నుండి వివాదాలను ఎదుర్కొంటోన్న అయోధ్య కేసుపై సుప్రీం కోర్టు తుది తీర్పును వెల్లడించింది. 
 
సుప్రీం కోర్టు ఈరోజు మసీదు నిర్మాణానికి ముస్లింలకు అయోధ్యలోనే ప్రత్యామ్నాయ స్థలం కేటాయించాలని నిర్ణయించింది. ఉత్తరప్రదేశ్ లేదా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ట్రస్ట్ ఆధీనంలో వివాదాస్పద స్థలాన్ని ఉంచాలని ఆదేశాలు జారీ చేసింది. జస్టిస్ రంజన్ గొగొయి తీర్పును చారిత్రాత్మక తీర్పుగా పేర్కొన్నారు. రెవిన్యూ రికార్డుల ప్రకారం వివాదాస్పద స్థలం ప్రభుత్వానికి చెందినదని అన్నారు. 
 
అయోధ్య స్థలం హిందువులదే అని సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది. హిందువులకు 2.77 ఎకరాల వివాదాస్పద స్థలం అప్పగించాలని ఆదేశించింది. అయోధ్యలోని వివాదాస్పద స్థలాన్ని పంచుకోవాలంటూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు తప్పుబట్టింది. బాబ్రీ మసీదు కూల్చివేత సరైనది కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 1949లో విగ్రహాలను పెట్టి మసీదును అపవిత్రం చేయడం, 1992లో మసీదును కూల్చివేయటం చట్టాన్ని ఉల్లంఘించటం కిందకు వస్తుందని కోర్టు పేర్కొంది. అన్ని విశ్వాసాలకు సమ ప్రాధాన్యం ఇస్తూ సుప్రీం కోర్టు ఇవాళ చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. 

దశాబ్దాల కాలం నుండి ఆర్టికల్ 370 , వివాదాలను ఎదుర్కొంటోన్న రామజన్మభూమి సమస్యలకు పరిష్కారం లభించటంతో కొత్త భారతావనికి మార్గం సుగమం అయింది.ఎన్నో సంవత్సరాల నుండి భారతదేశంలో వివాదాలను ఎదుర్కొంటోన్న సమస్యలకు పరిష్కారం లభించటం పట్ల ప్రజల్లో సంతృప్తి వ్యక్తమవుతోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: