దశాబ్దాలుగా నడుస్తున్న అయోధ్య వివాదానికి తెరపడింది. వివాదాస్పద స్థలం రామజన్మభూమేనని సుప్రీంకోర్టు తేల్చింది. వివాదాస్పద స్థలం మొత్తాన్ని రామజన్మభూమి న్యాస్‌కు అప్పజెప్పాలని సుప్రీంకోర్టు చారిత్రక తీర్పు ఇచ్చింది. మందిర నిర్మాణం కోసం 1993 రామజన్మభూమి చట్టాన్ని అనుసరించి 3 నెలల్లోపు ఒక ట్రస్ట్‌ను ఏర్పాటు చేయాలని సుప్రీం ఆదేశించింది.  సున్నీ వక్ఫ్‌ బోర్డుకు ఐదు ఎకరాల ప్రత్యామ్నాయ స్థలాన్ని ఇవ్వాలని కూడా ధర్మాసనం తీర్పు చెప్పింది. చీఫ్‌ జస్టిస్‌  రంజన్‌ గొగోయ్‌ నేతృత్వంలోని  ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ కీలక తీర్పు ఇచ్చింది. 


వివాదాస్పద స్థలం మొత్తం తమ అధీనంలోనే ఉన్నట్లు సున్నీ వక్ఫ్‌ బోర్డు కూడా నిరూపించలేకపోయిందని వెల్లడించింది సుప్రీంకోర్టు. కేవలం లోపలి భాగమే వివాదాస్పదమని తెలిపింది. అలాగే మసీదును ముస్లింలు ఎప్పుడూ వదిలేయలేదని స్పష్టం చేసింది ధర్మాసనం. వివాదాస్పద స్థలం లోపలి భాగాన్ని ముస్లింలు వదిలిపెట్టారనడానికి ఆధారల్లేవంది సుప్రీంకోర్టు. వివాదాస్పద స్థలం బయట భాగం నిరంతరంగా తమ అధీనంలోనే ఉందని హిందువులు నిరూపించారంది. న్యాయ సూత్రాల ఆధారంగానే భూ యాజమాన్యాన్ని నిర్ణయించాలని పేర్కొంది కోర్టు. 


సకాలంలోనే  సున్నీ వక్ఫ్‌ బోర్డు పిటిషన్‌ వేసిందని తేల్చింది సుప్రీం ధర్మాసనం. విగ్రహం పెట్టడమంటే మత దూషణ కిందకే వస్తుందని తెలియజేసింది. అలాగే హిందువుల నమ్మకం నిజమైనది కాదని అనడానికి ఆధారల్లేవు అని సీజే తన తీర్పులో స్పష్టం చేశారు. ఈ నమ్మకానికి విలువుందో లేదో తేల్చడం కోర్టు పరిధిలోనిది కాదని వెల్లడించింది. నమ్మకం, విశ్వాసాల ఆధారంగా భూ యాజమాన్య హక్కులను నిర్ణయించలేమని తేల్చి చెప్పింది ధర్మాసనం.  ఆలయాన్ని ధ్వంసం చేశారనడానికి...12 నుంచి 16 శతాబ్దాల మధ్య వివాదాస్పద స్థలంలో ఏముందో చెప్పడానికి  పురావస్తు ఆధారాల్లేవని తీర్పులో పేర్కొన్నారు సీజే. అయోధ్యను హిందువులు.. రామజన్మభూమిగా భావిస్తారని.. ఈ భావనలో ఎలాంటి వివాదానికి తావు లేదని స్పష్టంచేశారు. 


పురావస్తు పరిశోధనలను బట్టి చూస్తే.. 12వ శతాబ్దంలోనే  ప్రార్థనా స్థలం ఉందని పేర్కొంది సుప్రీంకోర్టు. అయితే అది దేవాలయం అని చెప్పడానికి ఆధారాల్లేవని తేల్చింది. ఆ స్థలంలో బాబ్రీ మసీదుకు ముందు ఇస్లామిక్‌ నిర్మాణాలేవీ లేవంది ధర్మాసనం. నిర్మోహీ అఖాడా పిటిషన్‌ ను కూడా సుప్రీంకోర్టు కొట్టేసింది. నిర్మోహీ పిటిషన్‌కు కాలం చెల్లడంతో దానిని కొట్టేస్తున్నట్లు వెల్లడించారు సీజే.  పురావస్తు శాఖ అధ్యయనాన్ని పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు. ఖాళీ ప్రదేశంలో బాబ్రీ మసీదును కట్టలేదన్నారు. అలాగే రామజన్మభూమి ఒక వ్యక్తి కాదని తీర్పులో తేల్చిచెప్పారు. 


బాబ్రీ మసీదు కచ్చితంగా ఎప్పుడు నిర్మించారనేదానికి ప్రాతిపదిక లేదని సీజే చెప్పారు. కాకపోతే బాబర్‌ కాలంలో బాబ్రీ మసీదు నిర్మించారన్నారు. అలాగే 1949లో బాలరాముడి విగ్రహాలు ఆ కట్టడంలో పెట్టారని తెలిపారు. అయితే మత గ్రంథాలను బట్టి కోర్టు తీర్పు ఉండబోదన్నారు సీజే. తమది ఏకాభిప్రాయ తీర్పుగా ప్రధాన న్యాయమూర్తి వెల్లడించారు. వివాదాస్పద భూమి తమదేనంటూ షియా బోర్డు దాఖలు చేసిన పిటిషన్‌ కొట్టివేశారు. చరిత్ర మతపరమైన , న్యాయపరమైన అంశాలను పరిగణనలోకి తీసుకుని తీర్పు ఇచ్చినట్లు వెల్లడించారు సీజే. 



మరింత సమాచారం తెలుసుకోండి: