ఎందరో  కవులు మరెందరో  సినీ రచయితలు కాశ్మీర్ అందాలను ఎంత అందగా వర్ణించారంటే ఆ భావాలు మాటలకు అందని ముత్యాల్లా తోస్తాయి. అందుకే స్వామి రామతీర్థ, భారత కిరీటము కాశ్మీరము నా శిరస్సు అన్నారు. ఎందుకంటే ప్రతి మనిషికి తల లేని శరీరాన్ని ఊహించడం ఎలా సాధ్యం కాదో, కాశ్మీరులేని భారత్‌ని ఊహించడం కూడా అంతే కష్టం. మన అణు వణువు నిండుకుని నాదంలా మోగే గుండె లయల శబ్దమే ఈ కాశ్మీరం.


ఇంతే కాకుండా నిత్యం మనం నిర్వహించే పూజాదికాల్లో చెప్పబడే జానపదాల జాబితాలో అంగ, వంగ, కళింగ, కాశ్మీర్, కాంభిజ అంటూ చెబుతుంటారు. ఇకపోతే కాశ్మీర్‌ అంటే కాశ్మీర్‌ ప్రాంతం ఒక్కటే కాదు, జమ్మూకాశ్మీర్‌ దశాబ్దాలుగా ‘రావణకాష్టం’లా మండుతోంది.. అందుకే ఈ ప్రాంతాన్ని కల్లోల కాశ్మీరం అంటున్నాం. ఇక బ్రిటిష్‌ పాలకులు దోచుకున్నది చాలక,  రేపిన చిచ్చు ఫలితమిది.


లేకపోతే, ఇప్పుడు భారత్‌ – పాకిస్తాన్‌ అంతా కలిసి  ఒకే దేశంగా వుండి వుండేవేమో! ఇక విస్తీర్ణం పరంగా లడఖ్‌ పెద్దదైనా, జనాభా మాత్రం జమ్మూకాశ్మీర్‌లోనే ఎక్కువ. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్‌ నుంచి లడఖ్‌ వేరుపడింది. కాబట్టి ఈ రెండూ  కేంద్ర పాలిత ప్రాంతాలే. మరో గమనించదగ్గ విషయం ఏంటంటే లడఖ్‌ ప్రశాంతంగా వుండే ప్రాంతమైతే, జమ్మూకాశ్మీర్‌ రావణ కాష్టంలా రగులుతూ ఉంటుంది. జమ్మూకాశ్మీర్‌ అంతా తీవ్రవాదులతో నిండి వుందనుకుంటే పొరపాటే. అందులో  కొన్ని జిల్లాల్లోనే తీవ్రవాద కార్యకలాపాలు ఎక్కువగా వుంటాయి.


ప్రస్తుతానికి తుపాకీ నీడనే జమ్మూకాశ్మీర్‌ ప్రజలు బతుకులీడుస్తున్నారన్నది నిర్వివాదాంశం. ఎందుకంటే కొందరు తీవ్రవాదుల తుపాకీ నీడన, మరికొందరు భారత జవాన్ల తుపాకీ నీడన బ్రతుకుతున్నారు అంతే తేడా. అతి త్వరలోనే తుపాకీ చప్పుడు ఆగిపోతుందనీ, పాకిస్తాన్‌తో జమ్మూకాశ్మీర్‌కి పూర్తిగా సంబంధాలు తెగిపోయాయి గనుక, అక్కడ తీవ్రవాదాన్ని అంతమొందించడానికి పెద్దగా సమయం పట్టకపోవచ్చనీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


అందులో నిజం లేకపోలేదు. అదీ గాకుండా గతంలో జమ్మూకాశ్మీర్‌లో అమల్లో వున్న చట్టాలకీ, ఇప్పుడు అమల్లోకి రానున్న చట్టాలకీ స్పష్టమైన తేడా వుంది. ఆ తేడానే తీవ్రవాద భావజాలానికి పెను ముప్పుగా మారబోతోంది. అయితే, దానికి కొంత సమయం పడుతుంది. ఐతే ఒక్కటి మాత్రం నిజం.. ఆ సేతు హిమాచలం.. ఒక్కటయ్యిందిప్పుడు.! ఇక, మిగిలింది పాక్‌, చైనా ఆక్రమణలో వున్న ప్రాంతం. లడఖ్‌, జమ్మూకాశ్మీర్‌లో పరిస్థితులు ఓ కొలిక్కి వస్తే.. ఆ వెంటనే, పాక్‌ మరియు చైనా ఆక్రమిత కాశ్మీర్‌లపై సైనిక చర్య తప్పకపోవచ్చునే అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: