అయోధ్య వివాదానికి శతాబ్దాల చరిత్ర ఉంది. 16వ శతాబ్దంలో మసీదు నిర్మాణంతో మొదలైన వివాదం.. నేటికి పరిష్కారమైంది.  సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం అయోధ్య కేసులో తుది తీర్పు వెలువరించింది.  


అయోధ్యలో వివాదాస్పద స్థలం కోసం ఇటు హిందువులు, అటు ముస్లింలు ఏళ్ల తరబడి న్యాయపోరాటాలు చేశారు. అది రామ జన్మభూమి అని హిందువులు.. అది మసీదేనని ముస్లింలు వాదిస్తూ వచ్చారు. అలహాబాద్ హైకోర్టు వివాదాస్పద స్థలాన్ని హిందూ, ముస్లిం పార్టీలకు పంచినా.. గతంలో సుప్రీంకోర్టు స్టే తో ఆ తీర్పు నిలిచిపోయింది. స్వతంత్ర భారతంలోనే అత్యంత పురాతన కేసుగా ఉన్న అయోధ్య అంశాన్ని సుప్రీంకోర్టు పరిష్కరిస్తుంచింది.  


అయితే అయోధ్య సమస్యను కోర్టు బయటే పరిష్కరించుకోవడానికి చాలా ప్రయత్నాలు జరిగాయి. కానీ ఎవరూ మెట్టు దిగకపోవడంతో.. అనివార్యంగా కోర్టు జోక్యం చేసుకోవాల్సి ఉంది. అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే తర్వాత సుప్రీంకోర్టు మధ్యవర్తుల కమిటీని కూడా నియమించింది. ఈ కమిటీ గడువు కూడా దశలవారీగా పొడిగిస్తూ పోయింది. కానీ ఇంత చేసినా.. అయోధ్య వివాదంలో ఓ పరిష్కారం కనుగొనలేకపోయింది మధ్యవర్తిత్వ కమిటీ. దీంతో రోజువారీ విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. తీర్పును రిజర్వు చేసి కీలక తీర్పు వెలువరించింది. 


క్రీస్తు శకం 1528వ సంవత్సరంలో మొఘల్ సర్దార్ బాబ్రీ మసీదు నిర్మించినట్టు చరిత్ర చెబుతోంది. 1885లో మహంత్ రఘుబర్ దాస్ ఫైజాబాద్ సివిల్ కోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. వివాదాస్పద కట్టం బయట చిన్నపాటి మండపం నిర్మించుకోవడానికి అనుమతి కోరారు. అయితే కోర్టు ఆయన వినతిని తిరస్కరించింది. 1949లో వివాదాస్పద కట్టడం బయట గోపురం కింద రామ్ లల్లా విగ్రహాలు కనిపించాయి. 1950లో రామ్ లల్లా విగ్రహాలకు పూజలు చేయడానికి అనుమతివ్వాలని గోపాల్ సిమ్లా విశారద్ ఫైజాబాద్ సివిల్ కోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. అదే సంవత్సరంలో పరమహంస రామచంద్రదాస్ మరో వ్యాజ్యం వేశారు. రామ్ లల్లా విగ్రహాలు అక్కడే కొనసాగించాలని, పూజకు అవకాశం ఇవ్వాలని కోరారు. 


1959లో వివాదాస్పద కట్టడం ఉన్న స్థలం తమదేనని నిర్మోహీ అఖాడా కేసు వేసింది. ఈ స్థలం తమదేనని వాదిస్తూ.. సున్నీ వక్ఫ్ బోర్డ్ 1981లో వ్యాజ్యం దాఖలు చేసింది. 1986 ఫిబ్రవరి ఒకటిన హిందువులు పూజలు చేసుకునేందుకు వీలుగా వివాదాస్పద స్థలాన్ని తెరవాలని స్థానిక కోర్టు ఆదేశించింది. వివాదాస్పద కట్టడం విషయంలో స్టేటస్ కో మెయింటైన్ చేయాలని 1989 ఆగస్ట్ 14న అలహాబాద్ హైకోర్టు తీర్పు చెప్పింది. 1992లో రామ జన్మభూమిగా పిలుస్తున్న ప్రాంతంలో ఉన్న బాబ్రీ మసీదును కరసేవకులు కూల్చేశారు. 


1993 ఏప్రిల్ 3న వివాదాస్పద స్థలాన్ని స్వాధీనం చేసుకుంటూ.. కేంద్ర ప్రభుత్వం చట్టం చేసింది. అక్టోబర్ 24, 1994న సుప్రీంకోర్టు చారిత్రక తీర్పు ఇచ్చింది. మసీదు ఇస్లాంలో భాగం కాదని ఇస్మాయిల్ ఫారూఖీ కేసులో సుప్రీంకోర్టు చెప్పింది. ఏప్రిల్ 2002లో వివాదాస్పద స్థలం యాజమాన్య హక్కులపై హైకోర్టులో విచారణ మొదలైంది. 2003 మార్చి 13న వివాదాస్పద స్థలంలో ఎలాంటి మతపరమైన కార్యక్రమాలు అనుమతించొద్దని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మార్చి 14న సుప్రీంకోర్టు మరో డైరక్షన్ ఇచ్చింది. అలహాబాద్ హైకోర్టులో భూయాజమాన్య హక్కుల వివాదం తేలేవరకు.. వివాదాస్పద స్థలంలో మతపరమైన కార్యక్రమాలకు అనుమతి లేదని, మత సామరస్యాన్ని కాపాడటం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్టు గతంలో సుప్రీం స్పష్టం చేసింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: