అయోధ్య అంశంలో భూయాజమాన్య హక్కుల అంశం కీలకంగా మారింది. యాజమాన్య హక్కుల కోసం హిందూ, ముస్లిం పార్టీలు పోటాపోటీగా వాదనలు వినిపించాయి. దీనిపై చివరకు అలహాబాద్ హైకోర్టు తీర్పు చెప్పినా.. సుప్రీం స్టే విధించడంతో.. అప్పట్లో వివాదం మళ్లీ మొదటికొచ్చింది. 


సెప్టెంబర్ 30, 2010న అయోధ్య భూయాజమాన్య హక్కులపై అలహాబాద్ హైకోర్టు తీర్పు చెప్పింది. వివాదాస్పద స్థలాన్ని మూడు ముక్కలు చేసింది. సున్నీ వక్ఫ్ బోర్డ్, నిర్మోహీ అఖాడా, రామ్ లల్లాకు కేటాయించింది. అయితే అలహాబాద్ హైకోర్టు తీర్పుపై హిందూ, ముస్లిం పార్టీలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. దాదాపు 8 ఏళ్ల పాటు విచారణ జరిగిన తర్వాత అలహాబాద్ హైకోర్టు ఈ తీర్పు చెప్పింది. ముగ్గురు జడ్జిల ధర్మాసనం 2:1 మెజార్టీతో తీర్పు వెలువరించింది. అయితే అలహాబాద్ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు మే 9, 2011న స్టే విధించింది. 


2016 ఫిబ్రవరి 16న వివాదాస్పద స్థలంలో రామ మందిరం నిర్మించాలని కోరుతూ సుబ్రహ్మణ్య స్వామి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మార్చి 21న సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్.. వివాదాన్ని కోర్టు బయట పరిష్కరించుకోవాలని సూచించారు. ఆగస్ట్ 7న సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది. అలహాబాద్ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను విచారించింది. ఆగస్ట్ 8న షియా వక్ఫ్ బోర్డ్ కీలక సూచన చేసింది. ముస్లింలు అధికంగా ఉండే ప్రాంతంలో, వివాదాస్పద స్థలానికి కొంత దూరంలో మసీదు నిర్మించాలని అభిప్రాయపడింది. 


సెప్టెంబర్ 11న సుప్రీంకోర్టు అలహాబాద్ హైకోర్టు చీఫ్ జస్టిస్ కు వివాదాస్పద స్థలం విషయంలో ఆదేశాలు ఇచ్చింది. ఇద్దరు జిల్లా జడ్జిలను ఈ వ్యవహారంలో పర్యవేక్షణకు నియమించాలని సూచించింది. అయోధ్యలో ఆలయం, లక్నోలో మసీదు కట్టుకోవచ్చని షియా వక్ఫ్ బోర్డ్ నవంబర్ 20న సుప్రీంకోర్టుకు తెలిపింది. డిసెంబర్ 1న 32 మంది మానవ హక్కుల కార్యకర్తలు అలహాబాద్ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ పిల్ వేశారు. డిసెంబర్ 5న అయోధ్య కేసులో సుప్రీం చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఎదుట తుది విచారణ మొదలైంది.


ఫిబ్రవరి 8, 2018న సుప్రీంకోర్టు ప్రజాప్రయోజన వ్యాజ్యాల్ని విచారించడం మొదలుపెట్టింది. మార్చి 14న సుబ్రహ్మణ్యస్వామి సహా మిగతావాళ్లు దాఖలు చేసిన ఇంప్లీడ్ పిటిషన్లను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఏప్రిల్ 6న రాజీవ్ ధావన్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. 1994లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును.. విస్తృత ధర్మాసనం పరిశీలనకు పంపాలని కోరారు. కొన్ని ముస్లిం పార్టీలు 1994లో ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలని కోరుతూ.. అయోధ్య అంశంలో తీర్పు ఆలస్యమయ్యేలా చేస్తున్నాయని యూపీ సర్కారు జులై 6న సుప్రీంకోర్టుకు చెప్పింది. జులై 20న సుప్రీంకోర్టు తీర్పు రిజర్వు చేసింది. 


అయోధ్య కేసును ఐదుగురు జడ్జిల ధర్మాసనం ముందుంచాలన్న వినతిని సెప్టెంబర్ 27న సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. అక్టోబర్ 29న త్రిసభ్య ధర్మాసనమే విచారిస్తుందని స్పష్టం చేసింది. సుప్రీం చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం కీలక ఆదేశాలు ఇచ్చింది. అయోధ్య వివాదంలో పిటిషన్లన్నీ జనవరి 2019 లోగా సంబంధిత ధర్మాసనం ముందు పెట్టాలని ఆదేశించింది. తద్వారా విచారణ తేదీలు ఫిక్స్ చేయడానికి వీలవుతుందని చెప్పింది. సంబంధిత ధర్మాసనం జనవరి 10న పిటిషన్లపై విచారణ జరుపుతుందని త్రిసభ్య ధర్మాసనం చెప్పింది. జనవరి 8న అయోధ్య కేసు విచారణ కోసం ఐదుగురు సభ్యుల ధర్మాసనాన్ని సుప్రీంకోర్టు నియమించింది. చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలో సీనియర్ జడ్జిలు బాబ్డే, రమణ, లలిత్, చంద్రచూడ్ ధర్మాసనంలో సభ్యులుగా ఉన్నారు. జనవరి 10న కేసు విచారణకు ముందే బెంచ్ నుంచి లలిత్ వైదొలిగారు. జనవరి 29న జడ్జి బాబ్డే మెడికల్ లీవ్ పై వెళ్లారు. జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ అబ్దుల్ నజీర్ స్థానంలో రమణ, లలిత్ వచ్చారు. అయోధ్య కేసు కోసం ఏర్పాటు చేసిన ధర్మాసనం  ఫిబ్రవరి 26న విచారణ జరుపుతుందని సుప్రీంకోర్టు చెప్పింది. ఫిబ్రవరి 26న అయోధ్య కేసులో మధ్యవర్తిత్వానికి సుప్రీంకోర్టు ప్రతిపాదించింది. అయోధ్య కేసు రికార్డుల తర్జుమా కోసం ముస్లిం పార్టీలకు 8 వారాల సమయం ఇచ్చింది. 


మార్చి 8న ఐదుగురు జడ్జిల ధర్మాసనం అయోధ్య కేసును మధ్యవర్తిత్వ కమిటీకి ఇచ్చింది. మాజీ జడ్జి కలీఫుల్లా ఛైర్మన్ గా రవిశంకర్, సీనియర్ లాయర్ శ్రీరామ్ పంచు కమిటీ సభ్యులుగా ఉన్నారు. ఆగస్ట్ 2న మధ్యవర్తిత్వ కమిటీ వివాద పరిష్కారంలో విఫలమైనట్టు తేలింది. ఆగస్ట్ ఆరు నుంచి రోజువారీ విచారణ కింద కోర్టు వాదనలు వింటుందని ధర్మాసనం స్పష్టం చేసింది. సెప్టెంబర్ 18న మరో విడత మధ్యవర్తిత్వానికి సుప్రీంకోర్టు తలూపింది. అక్టోబర్ 18 లోగా వాదనలు ముగించాలని సూచించింది. కోర్టు సమయం ముగిశాక కూడా అయోధ్య కేసు విచారించాలని సెప్టెంబర్ 20న ధర్మాసనం నిర్ణయించింది. 40 రోజుల విచారణ తర్వాత అక్టోబర్ 15న తీర్పు రిజర్వు చేసింది సుప్రీంకోర్టు. నవంబర్ 17న సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ పదవీవిరమణ పొందే లోపే.. నవంబర్ 9న తీర్పు వెలువడింది.   



మరింత సమాచారం తెలుసుకోండి: