సుప్రీం కోర్టు అయోధ్య వివాదం పై చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. దాదాపు గా 134 సంవత్సరాలుగా వున్న ఈ వివాదంపై సుప్రీం ధర్మాసనం అయోధ్య రాముడిదే అని తేల్చి చెప్పింది.  మూడు నెలల్లో రామా మందిరం ఏర్పాటు చేయడానికి ఒక ట్రస్ట్ ఏర్పాటు చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించింది. తీర్పు పై సంయమనం పాటించాలని ప్రధాని నరేంద్ర మోడీ కోరారు. ఇక మసీదు నిర్మాణానికి ముస్లింలకు అయోధ్యలోనే ప్రత్యామ్నాయ స్థలం కేటాయించాలని కోర్టు నిర్ణయించింది. ఇందుకోసం సున్నీ వక్ఫ్‌ బోర్డుకు 5ఎకరాల స్థలం కేటాయించాలని న్యాయమూర్తులు ఆదేశించారు. కేంద్రం లేదా ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.


ఇక తెలంగాణ రాష్ట్రంలో,  దేశ వ్యాప్తంగా  చర్చనీయాంశమైన అయోధ్యలో రామమందిరం- బాబ్రీమసీదు కేసుపై సుప్రీం తీర్పు వెల్లడించిన నేపథ్యంలో నగరంలో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశామని సీపీ అంజనీకుమార్ అన్నారు. ఎవరైనా ఉద్దేశ పూర్వకంగా ఆందోళనలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు. సోషల్ మీడియా లో అయోధ్య తీర్పు పై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చెయ్యొద్దని హెచ్చరించారు.


ఆగ్రా గేట్ రోడ్ కి చెందిన ఒక వ్యక్తి అయోధ్య పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు గానూ పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. ఫేసుబుక్ వేదిక గా "నిజమైన దీపావళి ని ఈరోజు జరుపుకుంటాను" అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసాడు. 


మరో వైపు దేశ ప్రధాని మోడీ "అయోధ్య వివాదంలో సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. ఈ తీర్పును ఏ ఒక్కరి విజయంగానో.. మరొకరి పరాజయంగానో భావించరాదు. రామ భక్తులైనా, రహీం భక్తులైనా.. దేశభక్తి భావనను పెంపొందించుకోవాలి. అప్పుడే శాంతి, సౌఖ్యాలు వర్థిల్లుతాయి. ఇది చరిత్రాత్మక తీర్పు. సహృద్భావ వాతావరణంలో ఈ సమస్య పరిష్కరించబడింది. న్యాయ వ్యవస్థలోని స్వతంత్రత, పారదర్శకత, దూరదృష్టి మరోసారి తేటతెల్లమైంది. చట్టం ముందు అందరూ సమానులే అని తేల్చింది. ఐకమత్యంతో అందరం ముందుకు సాగుతూ జాతి అభివృద్ధిలో.. ప్రతీ భారత పౌరుడి అభివృద్ధికి పాటుపడాలి" అని తన ట్విట్టర్ అకౌంట్ లో ట్వీట్ చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: