30 ఏళ్ల నుంచి సుప్రీంకోర్టులో నలుగుతున్న అయోధ్య భూవివాదానికి  నేటితో తెరపడింది. అయోధ్యలో బాబ్రీ మసీదు నిర్మించాలని ముస్లింలు... రామమందిరం నిర్మించాలి అని హిందువులు మధ్య తలెత్తిన వివాదానికి   నేడు సుప్రీం కోర్టు తీర్పు ముగింపు పలికింది  . ఐదుగురు సభ్యులతో కూడిన ధర్మాసనం అయోధ్య భూవివాదం పై సంచలన తీర్పును వెలువరించింది. వివాదాస్పద అయోధ్య భూమి తమదేనంటూ ముస్లిం సంస్థలు నిరూపించుకోకపోవడంతో  అయోధ్య భూమిని హిందువులకి  చెందిన న్యాస్ కు అప్పగించింది సుప్రీంకోర్టు. కాగా ముస్లిం లకు ప్రత్యామ్నాయంగా ఐదెకరాల భూమిని అందించాలని  కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది. కాగా  సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై దేశ ప్రజలందరూ హర్షధ్వానాల వ్యక్తం చేస్తున్నారు. సుప్రీంకోర్టు తీర్పుపై స్పందించిన దేశ ప్రధాని నరేంద్ర మోడీ... ఇది రామ భక్తి... రహీమ్  భక్తి  కాదని  భారత భక్తి భావాన్ని పెంపొందించే సమయం అంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. 



 అయోధ్య తీర్పు పై స్పందించిన ఎంఐఎం అధినేత హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. అయోధ్య పై సుప్రీంకోర్టు తీర్పును ఆలిండియా పర్సనల్ లా బోర్డు తరహాలో తాను కూడా గౌరవిస్తానని అసదుద్దీన్ ఓవైసీ వాఖ్యానించారు. కానీ కోర్టు తీర్పు మీద ఏఐఎమ్ఎల్బి సంతోషంగా లేదని తెలిపిన అసదుద్దీన్ ఓవైసీ... తన అభిప్రాయం కూడా అదేనన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు తుది తీర్పు అని... కానీ న్యాయస్థానం పొరపాటు పడదు  అని లేదు కదా అంటూ ఆయన అన్నారు. అయితే గతంలో ఎవరైతే బాబ్రీ మసీదును కూల్చి వేసారో వారికే అయోధ్య ట్రస్టు ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఒకవేళ డిసెంబర్ 6న మసీదును కూల్చివేయకపోతే  సుప్రీంకోర్టు తీర్పు ఎలా ఉండేది... మసీదు అక్కడే ఉండి ఉంటే అత్యున్నత న్యాయస్థానం  ఏం తీర్పు చెప్పేది అని  అసదుద్దీన్ ఒవైసీ ప్రశ్నించారు. 



 అయితే అయోధ్య భూ వివాదంపై  విచారించిన సుప్రీంకోర్టు వివాదాస్పద 2.77 ఎకరాల భూమిని ట్రస్ట్ కి  అప్పగించాలని సూచించింది. ముస్లింలకు ప్రత్యామ్నాయం ఐదు ఎకరాలు కేటాయించాలని ఆదేశించింది.అయితే సుప్రీమ్ కోర్టు నిర్ణయం పై అసదుద్దీన్ ఒవైసీ విభేదించారు.  మసీదు కట్టుకోవడానికి భూమి లేక తాము వివాదాస్పద అయోధ్య భూభాగం కోసం  పోరాటం చేయలేదని... మా న్యాయపరమైన హక్కుల కోసం పోరాటం చేసామని  ఆయన తెలిపారు. తమకు ఎవరో  ఇచ్చే భూమి అవసరం లేదని..  తాను ఈ రోజున హైదరాబాద్ లో ఒక్క మాట అడిగితే  ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఐదు ఎకరాల భూమి కొనుగోలు చేసేంత సొమ్మును  దాతలు అందజేస్తారని ఆయన వ్యాఖ్యానించారు. తమకు ఎవరి బిక్ష అవసరం లేదని తెలిపిన అసదుద్దీన్ ఓవైసీ... తన వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం ఐదెకరాల ప్రత్యామ్నాయ భూమిని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు తిరస్కరించాలని సూచించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: