మహారాష్ట్ర రాజకీయాలు గవర్నర్ పాలన దిశగా సాగుతున్నాయి. సీఎం పీఠం విషయంలో ఇటు బీజేపీ, అటు శివసేన మొండికేయడంతో.. ప్రభుత్వ ఏర్పాటుపై పీఠముడి పడింది. చివరికి ఈ పరిణామాలు మహారాష్ట్ర ఎన్డీఏలో చీలికకు దారితీసింది. బీజేపీ-శివసేన మధ్య బంధం తెగింది. సీఎం పదవికి రాజీనామా చేసిన ఫడ్నవిస్ శివసేనపై విరుచుకుపడగా.. అంతేఘాటుగా కౌంటర్ ఇచ్చింది ఉద్ధవ్ ధాక్రే టీం.  


ఎన్నికలు ముగిసి రెండు వారాలు దాటుతున్నా... మహారాష్ట్ర రాజకీయాలు ఇంకా వేడిపుట్టిస్తూనే ఉన్నాయి. తాజా పరిణామాలు గవర్నర్ పాలన దిశగా  మారుతున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. ప్రస్తుత రాష్ట్ర అసెంబ్లీ గడువు ముగుస్తుండటంతో  సీఎం పదవికి దేవేంద్ర ఫడ్నవీస్ రాజీనామా చేశారు. గవర్నర్‌ భగత్‌ సింగ్‌ కోశ్యారీ  రాజీనామాను ఆమోదించారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటులో ఇంకా సందిగ్ధం కొనసాగుతున్నందున రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. మిత్ర పక్షాలైన బీజేపీ, శివసేన కూటమి స్పష్టమైన మెజారిటీతో విజయం సాధించినా, అధికార పీఠం విషయంలో ఇరు పార్టీల అధినేతలు మెట్టు దిగడంలేదు. సీఎం పదవిని చెరి సగం కాలం పంచుకోవాలనే శివసేన డిమాండ్‌కు బీజేపీ అంగీకరించడం లేదు. శివసేనకు ఉప ముఖ్యమంత్రి పదవి, కీలక మంత్రి పదవులు ఇస్తామని కూడా హామీ ఇచ్చారు. అయినా శివసేన 50:50 ఫార్ములాకే పట్టుబట్టింది. చివరికి ఈ పరిణామాలు మహారాష్ట్రలో బీజేపీ-శివసేన మైత్రీ బంధానికి బ్రేక్ వేసింది. అక్టోబరు 24న విడుదలైన ఎన్నికల ఫలితాల్లో బీజేపీ 105 సీట్లు గెలుచుకోగా... శివసేన 56, ఎన్సీపీ 54, కాంగ్రెస్‌ 44 సీట్లు గెల్చుకున్నాయి. మిగిలిన స్థానాల్లో ఇతర పార్టీలు, స్వతంత్రులు గెలుపొందారు.  



ప్రభుత్వ ఏర్పాటులో ఏర్పడిన సంక్లిష్టతపై మిత్రపక్షాలు పరస్పస ఆరోపణలు, విమర్శలు చేసుకుంటున్నాయి. ప్రస్తుత పరిణామాలకు శివసేనే కారణమంటూ.. ఘాటుగా స్పందించారు ఫడ్నవీస్.  శివసేన తమను అవమానించిందనీ, ఇలాంటి పరిస్ధితుల్లో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయలేమని అన్నారు. అయితే ఆయన వ్యాఖ్యలకు శివసేన కౌంటర్ ఇచ్చింది.  ఫడ్నవీస్ చెబుతున్నవన్నీ అబద్ధాలేననీ,  సీఎం పదవి పంచుకుందామని చెప్తే నిరాకరించారని  ఉద్దవ్‌ఠాక్రే అన్నారు.


మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించినప్పటికీ గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారీ ప్రభుత్వ ఏర్పాటుకు ఎందుకు ఆహ్వానించడం లేదో తనకు అర్థం కావడం లేదని ఎన్.సి.పి అధినేత శరద్‌ పవార్‌ అన్నారు. త్వరలోనే ఓ నిర్ణయం వెలువడుతుందని తాను ఆశిస్తున్నట్లు చెప్పారు. మరోవైపు మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై నెలకొన్న సందిగ్ధత విషయంలో తాను జోక్యం చేసుకోబోనని  బీజేపీ అగ్రనేత, కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ స్పష్టం చేశారు. తాను ఆ దిశగా ఎలాంటి చర్చలు జరపడం లేదని.. తెలిపారు. మొత్తం మీద..మహారాష్ట్ర్రలో రాజకీయాలు ట్విస్టులో సాగుతూ ఉత్కంఠ రేపుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: