మొత్తానికి చలో ట్యాంక్ బండ్ కార్యక్రమం సక్సెస్ అయ్యింది. 36 రోజులుగా నిరవధికంగా సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులు శనివారం చలో ట్యాంక్ బండ్  కార్యక్రమాన్ని నిర్వహించేందుకు నిర్ణయించారు. అయితే దాన్ని భగ్నం చేయటానికి ప్రభుత్వం కూడా గట్టి ఏర్పాట్లనే చేసింది. కార్మికుల పట్టుదల ముందు ప్రభుత్వం చేసిన ఏర్పాట్లేవీ నిలవలేకపోయాయి.

 

చలో ట్యాంక్ బండ్ ను విజయవంతం చేయటానికి ఆర్టీసీ యూనియన్లకు మద్దతుగా రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్ధి సంఘాలు కూడా ముందుకొచ్చాయి. అందుకనే ప్రభుత్వం రాష్ట్రంలోని చాలా చోట్ల ముందస్తు అరెస్టులు చేసింది. చాలామంది నేతలను గృహనిర్భంధంలో ఉంచింది. శనివారం ఉదయం ఆర్టీసీ జేఏసి కన్వీనర్ అశ్వత్ధామరెడ్డి తదితరులను అరెస్టు చేసింది.

 

ఆర్టీసీ కార్మిక నేతలను, రాజీకీయ పార్టీల ప్రముఖులను అరెస్టులు చేసిన తర్వాత పోలీసులు కాస్త రిలాక్స్ ఫీలయ్యారు. అయితే వారు ఊహించని రీతిలో మధ్యాహ్నం సుమారు 3 గంటల తర్వాత కార్మికులు, ఉద్యోగులు, ఆందోళనకారులు ఒక్కసారిగా ట్యాంక్ బండ్ మీదను చుట్టుమట్టారు.  మూడు వైపుల నుండి పెద్ద ఎత్తున ఆందోళనకారులు ఒక్కాసారిగా ట్యంక్ బండ్ వైపుకు దూసుకురావటంతో పోలీసులు ఏమీ చేయలేకపోయారు.

 

 వందల సంఖ్యలో వచ్చిన ఆందోళనకారులను పోలీసులు చెదరగొట్టినా ఎవరు వెనక్కు తగ్గకుండా బ్యారికేడ్లను సైతం బద్దలు కొట్టుకుని ట్యాంక్ బండ్ మీదకు చేరుకున్నారు. లిబర్టీ సెంటర్, ఇందిరాపార్కు, కట్టమైసమ్మ గుడి ఇలా అన్ని వైపుల నుండి ఒక్కసారిగా ఆందోళనకారులు ట్యాంక్ మీదకు రావటంతో పోలీసులు లాఠీఛార్జి చేశారు.

 

చాలామందికి తీవ్ర గాయాలైనా ఎవరు లెక్క చేయలేదు. దాంతో చేసేది లేక పోలీసులు కూడా వదిలేశారు. మొత్తం మీద చలో ట్యాంక్ బండ్ కార్యక్రమం సక్సెస్ అయ్యింది. తమ గాయాలను కూడా లెక్క చేయకుండా ఆందోళనకారులు పోలీసులను తోసేసుకుని బ్యారికేడ్లను బద్దలు కొట్టుకుని ట్యంక్ బండ్ మీదకు చేరుకున్నారంటే కేసియార్ పై ఏ స్ధాయిలో మండిపోతున్నారో అర్ధమైపోతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: