ఓటమి ఏ నేతకైనా పాఠం నేర్పిస్తుంది. ఆ ఓటమి ద్వారానే మరింత కష్టపడి, బలపడుతూ ప్రజల మద్ధతు కూడబెట్టుకుని మరుపురాని విజయాలు సాధిస్తారు. ఇలాగే 2014 ఎన్నికల్లో ఓటమి ద్వారా పాఠం నేర్చుకుని జగన్...2019 ఎన్నికల్లో ఊహించని విజయం సాధించారు. చరిత్రలో లేని విధంగా 151 సీట్లు దక్కించుకున్నారు. ఐదేళ్లు జగన్ పడిన కష్టం వల్ల పెద్దగా పేరులేని నేతలు కూడా భారీ మెజారిటీలతో విజయం సాధించేశారు. మరి భారీగా ప్రజల మద్ధతు దొరికింది మనకింకా ఐదు సంవత్సరాలు వరకు తిరుగులేదు అనుకున్నారేమో గాని కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు పెద్దగా యాక్టివ్ గా కనిపించడం లేదు.


అందులో కృష్ణా జిల్లా ఎమ్మెల్యేలు కొందరు బద్దకంగా కనిపిస్తున్నట్లున్నారు. ఎన్నికల్లో కృష్ణాలో ఉన్న 16 సీట్లలో వైసీపీ 14 గెలుచుకుంది. అందులో ముగ్గురు మంత్రులయ్యారు. మచిలీపట్నం నుంచి పేర్ని నాని, గుడివాడ నుంచి కొడాలి నాని, విజయవాడ వెస్ట్ నుంచి వెల్లంపల్లి శ్రీనివాస్ లు మంత్రులుగా ప్రభుత్వంలో బాగా యాక్టివ్ గా కనిపిస్తున్నారు. తమకు ఇచ్చిన శాఖకు న్యాయం చేస్తూ పాలనలో దూసుకెళుతున్నారు.


ఇక ఎమ్మెల్యేలు విషయానికొస్తే విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, పెడన ఎమ్మెల్యే జోగి రమేశ్ లు పార్టీలో ఫుల్ యాక్టివ్ ఉన్నారు. ప్రతిపక్షాలు చేసే విమర్శలని వెంటనే తిప్పికొట్టేసి దుమ్ములేపుతున్నారు. అటు పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి మంత్రి పదవి దక్కకపోవడంతో కాస్తా అసంతృప్తిలో ఉన్నట్లు కనబడుతుంది. అటు సీనియర్ నేతలు గా ఉన్నర్ జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను,  నూజివీడు ఎమ్మెల్యే మేకా ప్రతాప్ నియోజకవర్గాల్లో అంత యాక్టివ్ గా లేనట్లు తెలుస్తోంది.


ఇక పామర్రు, నందిగామ, అవనిగడ్డ, కైకలూరు, తిరువూరు, మైలవరం ఎమ్మేల్యేలు నియోజకవర్గాల్లో ఎంతవరకు పని చేస్తున్నారు. జగన్ అమలు చేస్తున్న పథకాలని ప్రజలకు ఎంతవరకు చేరేలా చేస్తున్నారనేది అర్ధం కాకుండా ఉంది.  ఏదిఏమైనా వీరు ఇక నుంచైనా నియోజకవర్గాల్లో కనపడకపోతే పార్టీకి ఇబ్బంది అవుతుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: