సుప్రీంకోర్టు తీర్పును గెలుపోటములుగా చూడవద్దని.. అయోధ్య కేసులో సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు ఇచ్చిందని ప్రధాని మోదీ అన్నారు. సుప్రీం ఇచ్చిన తీర్పు చరిత్రలో నిలిచిపోతుందని ఇదొక కొత్త అధ్యాయమని అన్నారు. అన్ని వర్గాల వాదనలను సుప్రీం కోర్టు ఎంతో ఓపిగ్గా ఆలకించిందని.. ఏకగ్రీవంగా తీర్పు వెలువరించిందని అన్నారు. అందరినీ ఒప్పించడం అంత సులువైన విషయం కాదని ఈ సందర్భంగా న్యాయమూర్తులకు, న్యాయాలయాలకు ప్రధాని అభినందనలు తెలిపారు. అయోధ్య అంశంపై అత్యున్నత న్యాయస్థానం తుది తీర్పు వెలువరించిన నేపథ్యంలో జాతినుద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడారు.

 

 

‘ఈ తీర్పును దేశమంతా స్వాగతించి కలిసికట్టుగా నడవాలని ఇస్తున్న సందేశం. దేశ ప్రజలంతా ఐకమత్యంగా కలిసి ఉండే సమయం. అందరం కలిసి కొత్త ప్రారంభానికి శ్రీకారం చుడదాం. నవ భారతాన్ని నిర్మిద్దాం. అందరినీ కలుపుకొనిపోతూ.. అందరి అభివృద్ధి కాంక్షిస్తూ మనం ముందుకు సాగుదాం’ అని మోదీ పిలుపునిచ్చారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచంలోనే భారత్ అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం. భిన్నత్వంలో ఏకత్వానికి ఇవాళ్టి పరిస్థితులే నిదర్శనం. దశాబ్ధాలపాటు సాగిన న్యాయ ప్రక్రియకు ముగింపు పలికింది. భారత న్యాయవ్యవస్థలపై అంతర్జాతీయంగా ప్రశంసలు వస్తున్నాయి. ప్రపంచానికి మన దేశ గొప్పతనం తెలిసింది.

 

 

రామభక్తి, రహీం భక్తి కాదు.. దేశభక్తి భావాన్ని మనమంతా బలోపేతం చేయాలి. దేశ ప్రజలంతా శాంతి, ఐకమత్యంతో ఉండాలి. అయోధ్యపై తీర్పును అన్ని వర్గాల ప్రజలు స్వాగతించారు. ప్రజలు చాలా సంయమనం పాటించారు. 30 ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే నవంబర్‌ 9న బెర్లిన్‌ గోడ కూలింది. మళ్లీ అదే రోజు కర్తార్‌పూర్‌ కారిడార్‌ ప్రారంభమైంది. అయోధ్య కేసులో కోర్టు తీర్పు కూడా వెలువడింది. ఈ తీర్పు నేపథ్యంలో దేశప్రజలందరికీ నా ధన్యవాదాలు’ అంటూ ప్రధాని మోదీ తన సందేశాన్ని వినిపించారు.





మరింత సమాచారం తెలుసుకోండి: