వివాదాస్పద అయోధ్య స్థలంపై దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చిన తరువాత దేశ ప్రధాని నరేంద్ర మోడీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. చరిత్రలో ఇవాళ కొత్త అధ్యాయం మొదలైందని చెప్పారు. ఇది కలిసి నడవాల్సిన సమయమని మోడీ పేర్కొన్నారు.


"దీర్ఘకాలిక సమస్యపై సుప్రీం కోర్టు మహోన్నత తీర్పు వెలువరించింది. దశాబ్దాల పాటు సాగిన న్యాయ ప్రక్రియ ఇవాల్టితో ముగిసింది. భారత న్యాయవ్యవస్థలో ఈ రోజు సువర్ణాధ్యాయం మొదలైంది. తీర్పును దేశమంతా స్వాగతించింది. భిన్నత్వంలో ఏకత్వం అనే మంత్రం సంపూర్ణత్వంతో ఇవాళ వికసించింది. భారత దేశపు ఈ మూల సూత్రాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకుంటారు." అని మోడీ ప్రసంగం లో చెప్పారు. 


నవంబర్‌ 9 ఎంతో చారిత్రాత్మకమైన రోజు. అయోధ్యపై సుప్రీంకోర్టు మహోన్నతమైన తీర్పును వెలువరించింది. తీర్పును ఎవరూ గెలుపోటములుగా చూడవద్దు. తీర్పును స్వాగతించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ప్రజలు చాలా సంయమనం పాటించారు. భారత న్యాయవ్యవస్థపై అంతర్జాతీయంగా ప్రశంసలు అందుతున్నాయి. భారత్‌ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. భిన్నత్వంలో ఏకత్వానికి నేటి పరిస్థితే నిదర్శనం అని మోడీ పేర్కొన్నారు. 


కుటుంబంలో కూడా చిన్న చిన్న విభేదాలు ఉండొచ్చని, వాటన్నింటిని మనం ఎలా పరిష్కరించుకుంటామో ఈ తీర్పు వెనుక కూడా అలాంటి ప్రక్రియే కొనసాగిందని ఆయన వివరించారు. మన న్యాయ వ్యవస్థ, మన ఉన్నత విలువలు ఎంత విశిష్టమైనవో మరోసారి రుజువైందని చెప్పారు. "30 ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే నవంబర్‌ 9న బెర్లిన్‌ గోడ కూలింది. మళ్లీ అదే రోజు కర్తార్‌పూర్‌ కారిడార్‌ ప్రారంభమైంది. అయోధ్య కేసులో కోర్టు తీర్పు కూడా వెలువడింది. ఇది కలిసికట్టుగా నడవాలని ఇస్తున్న సందేశం. ఐకమత్యంగా కలిసి ఉండే సమయం. కొత్త ప్రారంభానికి శ్రీకారం చుడదాం. నవ భారతాన్ని నిర్మిద్దాం. అందరినీ కలుపుకొనిపోతూ అందరి అభివృద్ధి కాంక్షిస్తూ మనం ముందుకు సాగుదాం" అని మోడీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: