నిషేధిత మావోయిస్టు అనుబంధ  సంఘాలతో  ఆర్టీసీ కార్మికులు  చేతులు కలిపారా?  అంటే అవుననే  నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ అంటున్నారు.  మావోయిస్టు అనుబంధ  సంఘాలతో, ఆర్టీసీ కార్మికులకు  సంబంధాలు ఉండడం వల్లే ఛలో ట్యాంక్ బండ్  కార్యక్రమానికి  అనుమతి ఇవ్వలేదని అయన  సంచలన వ్యాఖ్యలు చేశారు.ఛలో ట్యాంక్ బండ్ కార్యక్రమానికి అనుమతి లేదని అయినా పెద్ద సంఖ్యలో కార్మికులు ట్యాంక్ బండ్ పైకి చొచ్చుకుని వచ్చే ప్రయత్నాన్ని చేశారన్న ఆయన , కార్మికులను అదుపు చేసేందుకే లాఠీఛార్జ్ , టియర్ గ్యాస్ ప్రయోగించాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు .


పోలీసులు లాఠీఛార్జ్ చేసి , టియర్ గ్యాస్ ప్రయోగించడం తో రెచ్చిపోయిన కార్మికులు పోలీసులపైకి రాళ్లు రువ్వారు . అయితే ఏడు, ఎనిమిది చోట్ల పోలీసులపై ఆర్టీసీ కార్మికులు రాళ్లు రువ్వడం చూస్తే , దీని వెనుక మావోయిస్టు అనుబంధ సంఘాల ప్రమేయం ఉండి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు . రాళ్ల దాడి  ఘటన లో పలువురు పోలీసులు గాయపడ్డారు . కార్మికులు , నిషేదిత మావోయిస్టులతో చేతులు కలిపారన్న  నగర పోలీస్ కమిషనర్ వ్యాఖ్యలను    ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వద్ధామ రెడ్డి తీవ్రంగా ఖండించారు .


 ఛలో ట్యాంక్ బండ్ కార్యక్రమం లో  మావోయిస్టులు ఉన్నారంటూ అనవసర  ఆరోపణలు చేసి సమ్మెపై   ఉక్కుపాదం మోపాలని చూస్తున్నారని అన్నారు . ఛలో ట్యాంక్ బండ్ కార్యక్రమం లో  మావోయిస్టులు పాల్గొన్నారంటూ  పోలీస్ కమిషనర్ వ్యాఖ్యానించడం దురదృష్టకరమని అశ్వద్ధామ రెడ్డి పేర్కొన్నారు. కమిషనర్  వ్యాఖ్యలు తమని  బాధించాయని చెప్పుకొచ్చారు . ఛలో ట్యాంక్ బండ్ కార్యక్రమం లో  కేవలం  కార్మికులు, వారి కుటుంబాలు మాత్రమే పాల్గొన్నారని అశ్వద్ధామ రెడ్డి అన్నారు .


మరింత సమాచారం తెలుసుకోండి: