తెలంగాణ రాష్ట్రంలోని అబ్ధుల్లాపూర్ మెట్ తహశీల్దార్ కార్యాలయంలో తహశీల్దార్ విజయారెడ్డిపై నిందితుడు సురేశ్ పెట్రోల్ పోసి నిప్పంటించి విజయారెడ్డి మృతికి కారణమైన విషయం తెలిసిందే. నిందితుడు సురేశ్ ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచనలం సృష్టించిన ఈ కేసు తరువాత చాలా ప్రాంతాలలో రెవిన్యూ అధికారులు తగిన రక్షణా చర్యలు మొదలుపెట్టారు. 
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలోని పత్తికొండ తహశీల్దార్ ఉమా మహేశ్వరి తన చాంబర్ చుట్టూ తాడు కట్టించారు. ఎవరైనా అర్జీలు ఇవ్వాలంటే తాడు బయటనుంచే ఇవ్వాలని ఉమామహేశ్వరి చెప్పారు. తాజాగా తెలంగాణ రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి తహశీల్దార్ కార్యాలయానికి ఒక రైతు పెట్రోల్ డబ్బాతో రావడంతో తహశీల్దార్ కార్యాలయ సిబ్బంది కంగారు పడ్డారు. 
 
పన్యాల చంద్రయ్య అనే రైతు ఒక వ్యక్తి దగ్గర 29 గుంటల భూమిని కొనుగోలు చేశాడు. కొనుగోలు చేసిన భూమిని తన భార్య పేరు మీద రిజిష్టర్ చేయించుకోవాలని చంద్రయ్య తహశీల్దార్ కు ధరఖాస్తు చేసుకున్నాడు. తహశీల్దార్ ఆఫీస్ లో తన ధరఖాస్తు గురించి తెలుసుకోవటానికి చంద్రయ్య వచ్చాడు. రైతు చేతిలో పెట్రోల్ డబ్బా చూసిన సిబ్బంది రైతు చంద్రయ్యను పరుగుపరుగున చుట్టుముట్టి పెట్రోల్ డబ్బాతో తహశీల్దార్ కార్యాలయానికి ఎందుకు వచ్చావని ప్రశ్నించారు. 
 
చంద్రయ్య పట్టా మార్పిడి కోసం తన భార్య ఎప్పుడు సంతకం పెట్టాలో తెలుసుకునేందుకు వచ్చానని తన గ్రామంలో పెట్రోల్ దొరకదని బైక్ కు అవసరమైన పెట్రోల్ కొనుగోలు చేశానని చెప్పాడు. విషయం తెలిసిన తరువాత రెవిన్యూ కార్యాలయంలోని సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. ఆ తరువాత కార్యాలయంలోని సిబ్బంది రైతుకు కావాల్సిన సమాచారాన్ని చెప్పి అక్కడినుండి పంపించేశారు. తహశీల్దార్ విజాయారెడ్డి ఘటనతో రెవిన్యూ అధికారులు కంగారు పడుతున్నారని ఈ ఘటన ద్వారా తెలుస్తోంది. 




మరింత సమాచారం తెలుసుకోండి: