సాధారణంగా దున్నపోతు ధర 10,000 రూపాయల నుండి 20,000 రూపాయల వరకు ఉంటుంది. మేలు జాతికి చెందిన దున్నపోతుల ఖరీదు లక్షల్లో ఉంటుంది. కానీ హరియాణాలోని సైనిపురాకు చెందిన వీరేందర్ సింగ్ పెంచుకునే సర్తాజ్ అనే పేరుతో పిలిచే దున్నపోతు ధర మాత్రం ఇరవై ఏడు కోట్ల రూపాయలు. ఈ దున్నపోతు రోజుకు ఐదు వేల రూపాయల ఖరీదు చేసే దాణా తింటుంది. 
 
25సార్లు జాతీయ స్థాయిలో ఈ దున్నపోతు నంబర్ వన్ గా నిలిచింది. రెండు నెలల వయస్సు ఉన్న దున్నపోతును వీరేందర్ కొనుగోలు చేశాడు. ప్రస్తుతం ఈ దున్నపోతు వయస్సు నాలుగున్నర సంవత్సరాలు. సర్తాజ్ తండ్రి సామ్రాట్ అనే దున్నపోతు కూడా ఎన్నో పశుమేళాల్లో అవార్డులు అందుకుంది. గతంలో ఇరవై ఏడు లీటర్ల పాలిచ్చి సర్తాజ్ తల్లి లంబూ రికార్డు సృష్టించింది. సీ.ఐ.ఆర్.బి. అనే సంస్థ దున్నపోతు, బరువు, ఎత్తును బట్టి ర్యాంకింగ్ ఇస్తుంది. 
 
ఈ సంస్థ సర్తాజ్ వీర్యం ద్వారా జన్మించిన గేదెలు 20 లీటర్ల పాలిస్తున్నట్లు సర్టిఫై చేసింది. సర్తాజ్ వీర్యం ద్వారా వీరేందర్ సంవత్సరానికి కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు. వారంలో రెండుసార్లు సర్తాజ్ నుండి వీర్యం తీసి భద్రపరిచి 100ఎమ్.ఎల్ 300 రూపాయల నుండి 500 రూపాయలకు వీరేందర్ అమ్ముతున్నాడు. సీ.ఐ.ఆర్.బీ డీ.ఎన్.ఏ టెస్ట్ ద్వారా లంబూ, సామ్రాట్ సంతానం సర్తాజ్ అని నిర్ధారించింది. 
 
60 కేజీల బరువుతో పుట్టిన సర్తాజ్ బరువు ఇప్పుడు 1600 కేజీలు. ఆరడుగుల ఎత్తు, పదిహేడు అడుగుల పొడవు ఉండే సర్తాజ్ ను ప్రతి రోజు ఐదు కిలోమీటర్లు వాకింగ్ కు ఈ దున్నపోతు కోసం ప్రత్యేకంగా నియమించిన సహాయకులు తీసుకెళతారు. వేసవిలో సర్తాజ్ కు ఏసీ, ఫ్యాను తప్పనిసరిగా ఉండాల్సిందే. రోజూ సర్తాజ్ 24 అరటిపండ్లు, 25 ఆపిల్స్, బాదం, కందిపప్పు, శనగ పప్పు, జీడిపప్పు, దాణా తింటుంది. రోజూ రెండు కేజీల బెల్లం నమిలి మింగేయటంతో పాటు పది లీటర్ల చిక్కటి పాలు తాగుతుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: