చంద్రబాబు విషయంలో ఒక మాట ఉంది. ఆయన మంచి వ్యూహకర్త అంటారు కానీ మాటల మరాఠీ అని ఎవరూ చెప్పలేదు. అన్న గారి నుంచి అధికారం తీసుకున్న తొలి రోజుల్లో బాబు ప్రసంగాలు చాలా క్లుప్తంగా ఉండేవి. అప్పట్లో అన్న‌ నందమూరితో పోల్చుకున్న వారు బాబుని తీసికట్టుగా కట్టేసేవారు. అన్నగారు   సంస్క్రుత సమాసాల పదబంధంలో కూడిన అద్భుతమైన ఉపన్యాసాలు చేసేవారని గుర్తు చేసుకునేవారు.


కాలగమనంలో బాబు మాటలు పెంచుకున్నారు. అవి ఎలా మారాయంటే అవసరానికి మించి ఒకే మాటను పదే పదే చెప్పడం, చెప్పిందే చెప్పడం బాబు గారికి అలవాటు అయిందన్న విమర్శలు కూడా వచ్చాయి. చంద్రబాబు అధికారంలో ఉన్నపుడు ఎలా మట్లాడినా చలామణీ అవుతుందేమో కానీ విపక్షంలో ఉంటే మాత్ర ఆయన ఉత్తేజంగా మాట్లాడాలి. క్యాడర్ని ఉరకలు పరుగులు పెట్టించాలి. కానీ బాబు మాత్రం రొడ్డకొట్టుడు స్పీచులతో తమ్ముళ్ళకు తలనొప్పి తెప్పిస్తున్నాడని అంటున్నారు. జిల్లాల టూర్లో బాబు చేస్తున్న ప్రసంగాలు ఎంతసేపు జగన్ని తిట్టడానికే సరిపోతున్నాయి తప్ప మరో కొత్త విషయం ఏదీ లేదని కూడా అంటున్నారు.ఈ తరహా స్పీచులు ఎన్నికల ముందు నుంచి, ఇంకా చెప్పాలంటే గత ఏడాది ధర్మ పోరాట దీక్షల నుంచి వింటున్నవేనని కూడా తమ్ముళ్ళు సణుక్కుంటున్నారు.


అయినా బాబోరు వూరుకోరుగా, మహా బోరు కొట్టించేస్తున్నారట. ఎంతసేపు సైబరాబాద్ కట్టాను, అమరావతి కట్టాను, జగన్ అవినీతిపరుడు ఇలా సాగుతున్నాయి బాబు గారి ప్రసంగాలు, దీని వల్ల క్యాడర్ కి ఏం ఉత్సాహం ఉంటుందని కూడా ప్రశ్న వస్తోంది. బాబు మారాలి అని తమ్ముళ్ళు అంటున్నది కూడా అందుకే. ఎన్నికల్లో ఓడిపోయారు కదా ఇపుడు ఏం చేయాలి. ఎలా జనంలోకి పోవాలి ఇలా నిజాయతీగా సమీక్ష చేసుకుంటే ఉత్తమ‌ ఫలితాలు వస్తాయని, అంతే తప్ప జగన్ని తిడుతూ ఉంటే ఏం సాధిస్తామని కూడా తమ్ముళ్ళ నుంచే వస్తోంది. మరి బాబోరు మారుతారా. బోరు స్పీచులకు విముక్తి ఉంటుందా..


మరింత సమాచారం తెలుసుకోండి: