తెలుగు రాష్ట్రాలలో కలకలం రేపిన చిత్తూరు జిల్లాలో చిన్నారి వర్షిత (6) హత్య ఘటనపై ఏపీ ముఖ్యమంత్రి జగన్ స్పందించారు. ఈ ఘటన తనని తీవ్రంగా కలచివేసిందని ఆయన చెప్పారు. వీలైనంత త్వరగా హంతకుడిని పట్టుకొని చట్టం ముందు నిలబెట్టాలని సీఎం అన్నారు. ఇంతటి దారుణ హత్యకు పాల్పడిన వ్యక్తికి కఠినంగా శిక్ష పడేలా చూడాలని పోలీసులను సీఎం సూచించారు. కురబలకోట మండలం అంగళ్లు పంచాయతీ చేనేతనగర్‌ లోని కల్యాణ మండపం వద్ద వర్షిత హత్యకు గురైన సంగతి అందరికి తెలిసిన విషయమే.


ఈ కేసు పై ఇప్పటికే జిల్లా పోలీసు యంత్రాంగం ప్రత్యేక దృష్టి పెట్టింది. సీసీ పుటేజీల ఆధారంగా నిందితుడి ఊహా చిత్రాన్ని కూడా విడుదల చేశారు పోలీసులు. అయితే సీసీ కెమెరాలో పరిశీలించిన పోలీసులకు చిన్నారి వర్షిత బయటకు ఏవిధంగా వెళ్లిందనే విషయం మిస్టరీ గానే మారింది. రాత్రి గుర్తుతెలియని వ్యక్తితో ఉండి, అతని మొబైల్ లో ఫొటోలు చిత్రీకరిస్తున్న దృశ్యాలు కనిపించాయి. కల్యాణ మండపం లోని మరుగుదొడ్డి వైపు వెళ్లిన వీరిద్దరిలో అనుమానితుడు మాత్రమే పదహైదు నిమిషాల అనంతరం వెనుదిరిగి మళ్లీ కల్యాణ మండపం లోకి వచ్చాడు. 


అక్కడ వాహన సిబ్బంది కోసం ఐస్ క్రీమ్ డబ్బాలు తీసుకుని వెళ్తున్నట్లు అతను బుకాయించగా అడ్డుకోవడంతో అక్కడి నుంచి బయటికి వెళ్లినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. గురువారం రాత్రి నుంచి కనిపించకుండా పోయిన చిన్నారి వేకువ జామున కల్యాణ మండపం వెనుక దాదాపు ఇరవై అడుగుల ఎత్తు ఉన్న ప్రహరీ కింద వంకలో కనిపించడమూ అందరికి మిస్టరీగానే మారింది. చిన్నారిని ప్రహరీ ఏవిధంగా దాటించాడనే విషయం పోలీసులకు అసలు అంతు చిక్కడం లేదు. అత్యాచారం చేసి హత మార్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ సంఘటనలో నిందితుడు ఒక్కడే ఉండకపోవచ్చని, ఇద్దరు లేదా ముగ్గురు ఉండవచ్చని ఒక అంచనాకి వచ్చారు.


మరింత సమాచారం తెలుసుకోండి: