ఆర్టీసీ రూట్ల  ప్రయివేటీకరణ పై అభ్యంతరాలు వ్యక్తమవుతోన్న నేపధ్యం లో ప్రభుత్వం అవే రూట్లను  లీజు పద్దతిలో ప్రయివేట్ ఆపరేటర్లకు కట్టబెట్టాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది . ఆర్టీసీ కార్మికుల సమ్మె కు వెళ్లడం చట్టవిరుద్ధమని పేర్కొంటూ , 5100  ఆర్టీసీ రూట్లను ప్రయివేటీకరించాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన విషయం తెల్సిందే . ఇటీవల జరిగిన మంత్రిమండలి సమావేశం కూడా , ఈ నిర్ణయానికి ఆమోద ముద్ర వేసింది . దీనితో 5100 రూట్లు ప్రయివేటుపరం కావడం భావిస్తున్న తరుణం లో పలువురు కోర్టును ఆశ్రయించడం , కోర్టు ఈ నెల 11 వతేదీ వరకు, రూట్ల ప్రయివేటీకరణ పై ఎటువంటి నిర్ణయం తీసుకోవద్దని ప్రభుత్వాన్నిఆదేశించింది .


 రాష్ట్ర విభజన చట్ట ప్రకారం ఆర్టీసీ అన్నది విభజన కాకుండానే ,  బస్సు రూట్లను ప్రయివేటీకరిస్తే న్యాయపరమైన చిక్కులు తప్పకపోవచ్చునని భావిస్తోన్న కేసీఆర్ సర్కార్ కొత్త ఎత్తుగడ వేస్తున్నట్లు తెలుస్తోంది . ఎలాగైనా తన పంతాన్ని నెగ్గించుకోవాలన్న ఉద్దేశ్యం తో ప్రయివేటీకరించాలని నిర్ణయించిన  ఆర్టీసీ రూట్ల లో లీజు ప్రాతిపదికన బస్సులను తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది . దీనివల్ల న్యాయపరమైన చిక్కులను అధిగమించడం తోపాటు , తమ మాట నెగ్గించుకున్నట్లు అవుతుందని కేసీఆర్ సర్కార్ యోచనలో ఉన్నట్లు సమాచారం . లీజు గడువు తక్కువ గా నిర్ణయించి బస్సులను తీసుకోవడం ద్వారా అటు ప్రజల రవాణా కష్టాలు తీరడంతోపాటు , ఇటు న్యాయపరమైన చుక్కులను అధిగమించే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తోంది .


 ఇప్పటికే ఆర్టీసీ వద్ద   2100  అద్దె బస్సులు ఉన్నాయి , 5100 రూట్లలో లీజు ప్రాతిపదికన  బస్సులను తీసుకోవడం ద్వారా, ఆర్టీసీ  కార్మికులు  సమ్మె చేపట్టిన అనంతరం రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న  రవాణా కష్టాలు తీరుతాయని కోర్టు నివేదించవచ్చునని ప్రభుత్వం భావిస్తోంది .


మరింత సమాచారం తెలుసుకోండి: