అయోధ్యపై సుప్రీం కోర్టు తీర్పు తర్వాత స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. దశాబ్దాలుగా తీర్పు ఎలా వస్తుందోనని టెన్షన్ పడుతున్న వారి మనసులు కాస్త తేలికపడ్డాయి. తీర్పుకు ముందు అయోధ్య వీధులన్నీ నిర్మానుష్యంగా కనిపించాయి. తీర్పు తర్వాత కూడా పరిస్థితిలో పెద్దగా మార్పు రాలేదు. ముందు జాగ్రత్తగా 144 సెక్షన్ విధించడంతో.. అయోధ్య రహదారులు బోసిపోయాయి. 


దశాబ్దాలుగా నలుగుతున్న అయోధ్య వివాదంలో సుప్రీంకోర్టు తుది తీర్పు ఇవ్వడంతో.. అయోధ్య వాసులు టెన్షన్ ఫ్రీ అయ్యారు. అయోధ్య కేసు కారణంగా చీటికీమాటికీ ఉలిక్కిపడుతున్న స్థానికులకు.. సుప్రీం తీర్పు పెద్ద ఊరటే ఇచ్చింది. దేశంలో ఎక్కడ, ఎవరు అయోధ్యపై ఏ కామెంట్ చేసినా.. దాని ప్రభావం అయోధ్య సిటీపై ఉండేది. దీంతో స్థానికులు బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన పరిస్థితి. అయితే సుప్రీంకోర్టు తుది తీర్పు ఇవ్వడంతో.. ఇక అయోధ్య సిటీలో ఉద్రిక్తతలకు తావుండదని అందరూ విశ్వసిస్తున్నారు. 


అయోధ్యపై సుప్రీం తీర్పుకు ముందు స్థానికంగా టెన్షన్ వాతావరణం కనిపించింది. వివాదాస్పద స్థలంతో పాటు ఎక్కడ చూసినా పోలీస్ బారికేడ్లే దర్శనమిచ్చాయి. స్థానిక పోలీసులకు తోడు సీఆర్పీఎఫ్ బలగాలు కూడా రంగంలోకి దిగాయి. దీంతో అయోధ్య వాసులు ముందు జాగ్రత్తగా నిత్యావసరాలు, మందులు కొనుగోలు చేసి పెట్టుకున్నారు. ఉద్రిక్తతలు తలెత్తే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ హెచ్చరికలతో ఎప్పుడేం జరుగుతుందోనని టెన్షన్ పడ్డారు. స్థానిక వ్యాపారులు కూడా ముందస్తుగానే షాపులు మూసేశారు. దీంతో అయోధ్య రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపించాయి. 


తీర్పు తర్వాత ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకపోవడం.. అన్ని వర్గాలు సుప్రీం తీర్పును స్వాగతించడంతో.. స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ముందుజాగ్రత్త చర్యగా 144 సెక్షన్ కొనసాగిస్తున్నా.. ఇకపై అయినా తాము ప్రశాంత జీవితం గడపొచ్చనే ఆనందం స్థానికుల్లో కనిపించింది. సుప్రీంకోర్టు తీర్పును హిందూ, ముస్లిం పార్టీలు రెండూ స్వాగతించడం కూడా శుభపరిణామంగా భావిస్తున్నారు. అయోధ్యలోనే ముస్లింలకు స్థలం ఇవ్వాలన్న కోర్టు తీర్పు తరుణంలో.. మందిరంతో పాటు మసీదు నిర్మాణం కూడా జరిగితే.. వివాదానికి శాశ్వతంగా తెరపడుతుందని అయోధ్య వాసులు భావిస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: