ప్రముఖ రచయిత వైరముత్తుపై లైంగిక వేధింపుల ఆరోపణల ప్రభావం ఏ మాత్రం లేదని గాయని చిన్మయి ఆందోళన వ్యక్తం చేసింది. తప్పు చేసిన వారిని వేడుకలకు ఆహ్వానిస్తూ.. బాధితులపై నిషేధం విధించడమేంటని ఆమె ప్రశ్నించింది. తమిళనాట సినీపెద్దలు చాలా బాగా వ్యవహరించారంటూ సెటైర్లు వేసింది చిన్మయి. 


వైరముత్తుపై చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలు అతడిపై ఎలాంటి ప్రభావం చూపలేదని గాయని చిన్మయి శ్రీపాద అసహనం వ్యక్తం చేశారు. కమల్‌ హాసన్‌ నిర్వహించిన కె. బాలచందర్‌ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి రజనీకాంత్‌తోపాటు వైరముత్తు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమల్‌, రజనీతో కలిసి వైరముత్తు తీసుకున్న ఫొటోను చిన్మయి సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేశారు. నిందితుడు వైరముత్తు వేడుకలకు హాజరవుతుంటే బాధితురాలిని చిత్ర పరిశ్రమ నుంచి నిషేధించారని అసంతృప్తి వ్యక్తం చేశారు.


మీటూ ఉద్యమం లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న పురుషుల జీవితాలను నాశనం చేసిందని గుర్తుచేసిన చిన్మయి.. వైరముత్తు మాత్రం దానికి మినహాయింపని చెప్పింది. డీఎమ్‌కే కార్యక్రమాలు, ఐఏఎస్‌ అధికారుల శిక్షణా కార్యక్రమాలు, తమిళ భాష వేడుకలు, పుస్తక ఆవిష్కరణలు, సినిమా వేడుకలకు వైరముత్తు అతిథిగా వెళ్తున్నారని గుర్తుచేసింది చిన్మయి. తనను మాత్రం వెంటనే చిత్ర పరిశ్రమ నుంచి నిషేధించారని ఆరోపించింది. తమిళనాడు చిత్ర పరిశ్రమ పెద్దలు బాగా న్యాయం చేశారని సెటైర్లు వేసింది. మీటూ ఉద్యమ సమయంలో వైరముత్తుపై చిన్మయి ఆరోపణలు చేసింది. చిన్మయితో పాటు పలువురు మహిళలు వైరముత్తు తమను వేధించాడని పేర్కొన్నారు. ఆ తర్వాత చిన్మయిని తమిళ చిత్ర పరిశ్రమ డబ్బింగ్‌ సంఘం నుంచి నిషేధించారు. 


లైంగిక వేధింపుల వ్యవహారంపై చిన్మయి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఇదెక్కడి న్యాయం అంటూ వాపోతోంది. మరోవైపు చిన్మయికి పలు సంఘాలు మద్దతు ప్రకటిస్తున్నాయి. న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నాయి. ఈ సమాజంలో మహిళకు అన్యాయం జరుగుతుంటే.. నిందితులను గౌరవిస్తారా అంటూ ప్రశ్నిస్తున్నాయి. 





మరింత సమాచారం తెలుసుకోండి: