భారత్ లో పర్యటిస్తానంటున్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. రెండు దేశాల మధ్య సంబంధాలు బాగున్నాయని ప్రకటించారు. మోడీ గొప్ప మిత్రుడని చెబుతూ.. హ్యూస్టన్ లో ఆయనతో వేదిక పంచుకున్న సంగతి గుర్తుచేశారు ట్రంప్. 


అమెరికా-భారత్‌ మధ్య మెరుగైన సంబంధాలు కొనసాగుతున్నాయని అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వ్యాఖ్యానించారు. ఇరు దేశాల మధ్య అనేక అంశాలపై చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. భారత్-అమెరికా మధ్య అనేక అంశాలపై చర్చలు జరుగుతున్నాయన్న ట్రంప్.. మోడీ తనకు గొప్ప మిత్రుడని చెప్పారు. హ్యూస్టన్ లో జరిగిన హౌడీ మోడీ సభలో ప్రధానితో కలిసి వేదిక పంచుకున్న సంగతి గుర్తుచేశారు ట్రంప్. 


ఏదో ఓ సమయంలో భారత్‌కు వెళతానని కూడా చెప్పారు. భారత పర్యటనపై తన అభిప్రాయాన్ని వెల్లడించడం విశేషం. హ్యూస్టన్‌లో హౌడీ-మోడీ సభ సందర్భంగా ట్రంప్‌ని కుటుంబసమేతంగా భారత పర్యటనకు ప్రధాని ఆహ్వానించారు. ట్రంప్‌ పర్యటన ఇరు దేశాల మధ్య సత్సంబంధాలను ఉన్నత శిఖరాలకు చేరుస్తుందని ప్రధాని ఆకాంక్షించారు. గత జూన్‌లో భారత్‌ను ప్రాధాన్య వాణిజ్య హోదా జాబితా నుంచి అమెరికా తొలగించింది. దీంతో భారత్‌కు చెందిన ఉత్పత్తులపై అగ్రరాజ్యం అధిక సుంకాలు విధించింది. దీనికి ప్రతిగా భారత్‌ కూడా అమెరికా వస్తువులపై సుంకాలు పెంచింది. ఈ తరుణంలో ఇరు దేశాల మధ్య వాణిజ్య విభేదాలు తెలెత్తాయి. దీనిపై ఉభయ దేశాల వ్యాపార, వాణిజ్య వర్గాలు ఆందోళన వ్యక్తం చేశాయి. 


వాణిజ్య విభేదాల పరిష్కారం దిశగా రెండు దేశాల ప్రతినిధులు, మంత్రులు విస్తృత స్థాయిలో చర్చలు జరుపుతున్నారు. త్వరలోనే దీనిపై ఓ ఒప్పందం కుదరొచ్చని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఇటీవలి అమెరికా పర్యటన సందర్భంగా తెలిపారు. చూడాలి ట్రంప్ పర్యటన ఇండియాలో ఎలా ఉండబోతోందో..! ఇప్పటికే ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్ కూడా హైదరాబాద్ లో పర్యటించారు. చారిత్రక ప్రదేశాలను ఆసక్తిగా తిలకించి ఆశ్చర్యపోయారు. మరి మోడీ, ట్రంప్ తో ద్వైపాక్షిక చర్చలతో పాటు.. ఏఏ పర్యాటక ప్రదేశాలకు తీసుకెళ్తారో చూడాలి.  




మరింత సమాచారం తెలుసుకోండి: