ఆంధ్రప్రదేశ్ లో ఇసుక కొరత తీవ్రంగా మారడంతో భవన నిర్మాణ కార్మికులు వలసబాటపడుతున్నారు. ఉపాధి వెతుక్కుంటూ ఇతర ప్రాంతాలకు వలసపోతున్నారు. ఇసుక సమస్య కారణంగా గ్రామాలు కూడా ఖాళీ అవుతున్నాయి. కర్నూలు జిల్లాలో భవన నిర్మాణ కార్మికుల పరిస్థితి అధ్వాన్నంగా ఉంది. 


కర్నూలు జిల్లాల కొసిగి మండలంలో సుమారు రెండు వేల మంది భవన కార్మికులు పనులు లేక తెలంగాణకు వలస పోయారు. మారుమూల గ్రామాలైన చింతకుంట, పల్లెపాడు, సజ్జలగూడేం, చిన్నబోంపల్లిలోని ప్రజలు ఎక్కువగా భవన నిర్మాణాలు, వ్యవసాయంపైనే ఆధారపడ్డారు. అయితే ఇసుక కొరత కారణంగా ఉపాధి కరవవడంతో వీళ్ల పరిస్థితి దిక్కుతోచని విధంగా తయారయ్యింది.


ఐదు నెలల నుంచి ఏర్పడిన ఇసుక కొరతతో.. వారానికి ఒక్క రోజు కూడా ఆ గ్రామాల్లోని ప్రజలకు పనులు దొరకడం లేదు. దీంతో.. పొట్టకూటి కోసం అక్కడి ప్రజలంతా కుటుంబాలతో సహా తెలంగాణకు వలసలు వెళుతున్నారు. ఇలా రెండు వేలకు పైగా గ్రామస్థులు వెళ్లిపోవడంతో.. అక్కడ ఏ ఇళ్లు చూసినా తాళం వేసే కనపడుతోంది. మరోవైపు.. ఈ ఏడాది వర్షాలు విస్తారంగా కురిశాయి. అయితే అవి కూడా అక్కడి రైతులకు శాపంగా మారాయి. పొంగి పొర్లుతున్న వాగులతో.. పంటలన్ని నీట మునిగి అన్నదాతలకు అపార నష్టం మిగిల్చింది. దీంతో అక్కడి భవన కార్మికులతో పాటు రైతులు కూడా వలస బాట పడుతున్నారు.


మొత్తం మీద ఇసుక కొరతతో భవన కార్మికులు, వరదలతో అన్నదాతలు వలసలు వెళుతుండడంతో.. రైల్వే స్టేషన్, బస్టాండ్‌లు కిక్కిరిసిపోతుంటే.. పల్లెలు మాత్రం బోసి పోతున్నాయి. ఇప్పటికైనా.. ప్రభుత్వం స్పందించి ఇసుక కొరత తీరిస్తే.. వలసలు ఆగుతాయంటున్నారు పల్లెవాసులు. ఇతర ప్రాంతాల్లోకి వలస వెళ్లిన భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి వెంటనే దొరుకుతుందా అంటే అదీ లేదు. ఎందుకంటే ఇప్పటికే ఏ అడ్డా చూసినా కార్మికులతో కిక్కిరిసిపోయి ఉంటుంది. ఎవరు పిలుస్తారా.. పనికి వెళ్దామా.. అని కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తుంటారు. ఇపుడు కొత్తగా మరికొంత మంది పెద్ద ఎత్తున నగరానికి క్యూ కడుతుండటంతో ఉపాధి దొరకడం సమస్యగా మారింది.  




మరింత సమాచారం తెలుసుకోండి: