బెంగాల్‌లో బుల్ బుల్ తుఫాన్‌ నలుగురి ప్రాణాలు బలి తీసుకుంది. మరికొందరిని నిరాశ్రాయుల్ని చేసింది. గాలివానకు ఇళ్లపైకప్పులు కొట్టుకుపోయాయి. మమతా బెనర్జీకి ఫోన్ చేసి పరిస్థితిపై ఆరా తీశారు ప్రధాని. ఇటు ఒడిషాపైనా తీవ్ర ప్రభావం చూపుతోంది. ఏపీలోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. 


బుల్‌ బుల్‌ తుఫాన్‌ ప్రభావంతో బెంగాల్‌ అతలాకుతలైమంది. అర్ధరాత్రి బెంగాల్‌- బంగ్లాదేశ్ మధ్య తీరం దాటిన తుఫాన్‌...భారీ గాలులతో బీభత్సం సృష్టించింది. గంటకు 120 నుంచి 140 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. అక్కడక్కడ కుంభవృష్టి కురుస్తోంది. ముఖ్యంగా ఛబ్బీస్ పరగణాల జిల్లాపై తుఫాన్‌ తీవ్ర ప్రభావం చూపుతోంది. భారీ వర్షాలకు ఇళ్లలోకి నీరు వచ్చి చేరింది. దీంతో బాధితులను రిలీఫ్ కేంద్రాలకు తరలించారు. ముందస్తు జాగ్రత్తగా కోస్టల్ ఏరియాలో లక్ష మందికి పైగా సురక్షిత ప్రాంతాలకు తరలించారు.  


కోల్‌కతా ఎయిర్‌పోర్టులో విమానరాకపోకల్ని నిలిపేశారు. 12గంటల పాటు సేవలను నిలిపేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఇప్పటికే స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించారు. అత్యవసరం ఐతే తప్పా.. ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ప్రజలకు ఆదేశాలు జారీ చేశారు. గాలివానకు అక్కడక్కడ భారీ వృక్షాలు విరిగిపడ్డాయి. కరెంట్ స్తంబాలు నేలకూలాయి. ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. ఇప్పటి వరకూ నలుగురు చనిపోయారు. ఇళ్ల గోడలు కూలి పదుల సంఖ్యలో గాయపడినట్లు అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే రంగంలోకి దిగిన రెస్క్యూ సిబ్బంది... సహాయక చర్యలు ముమ్మరం చేశారు. రోడ్డుకు అడ్డుగా పడిపోయిన చెట్లను తొలగిస్తున్నారు. కరెంట్‌ సదుపాయాన్ని పునరుద్దరిస్తున్నారు. 


ఇటు ఒడిశాలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. బాలోషోర్‌లో 350 గ్రామాలను ఖాళీ చేయించారు అధికారులు. ప్రభుత్వ కాలేజీలు, స్కూళ్లలో రిలీఫ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. బుల్‌బుల్ తుఫాన్‌పై ప్రధాని మోడీ సమీక్ష నిర్వహించారు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో ఫోన్‌లో మాట్లాడారు. కేంద్రం సాయం అందించేందుకు సిద్ధంగా ఉందని చెప్పారు. ఇటు రక్షణశాఖ అలర్టయ్యింది. విశాఖలో మూడు నౌకలు సహాయక సామగ్రితో సిద్ధంగా ఉన్నాయి. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే, సహాయక సామగ్రి చేరవేతకు నౌకాదళనికి చెందిన హెలీకాప్టర్లను సిద్ధం చేశారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: