డ్ర‌గ్స్ ఇప్పుడు ఏపీ రాజ‌ధాని న‌గ‌రాలు అయిన విజ‌య‌వాడ‌, గుంటూరులో తీవ్ర ప్ర‌కంప‌న‌లు రేపుతున్నాయి. ముఖ్యంగా విద్యార్థులే టార్గెట్‌గా ఈ ముఠాలు రెచ్చిపోతుండ‌డంతో విద్యార్థుల త‌ల్లిదండ్రుల్లో కూడా తీవ్ర ఆందోళ‌న‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఒక‌ప్పుడు డ్రగ్స్ అంటే ఎక్కువగా హైదరాబాద్, బెంగళూరు, ముంబై ప్రాంతాలకే ప‌రిమితం.


ఇప్పుడు అమ‌రావ‌తి రాజ‌ధాని అయ్యాక విజ‌య‌వాడ‌, గుంటూరు లాంటి రెండు కీల‌క న‌గ‌రాల‌ను ఈ డ్ర‌గ్స్ ముఠాలు బాగా టార్గెట్ చేశాయి. ఇక్క‌డకు ఇతర రాష్ట్రాల నుంచి భారీగా డ్రగ్స్ తెచ్చి విక్రయిస్తున్నారు. ఈ ప్రాంతంలో వంద‌ల సంఖ్య‌లో ఉన్న కాలేజ్ విద్యార్థుల‌ను ఈ డ్ర‌గ్స్‌కు అల‌వాటు చేసేందుకు ఈ ముఠాలు ర‌క‌ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తున్నాయి. ముందుగా చాలా త‌క్కువ రేట్ల‌కే మ‌త్తు మందులు విక్ర‌యిస్తున్నారు. విద్యార్థులు వీటికి అల‌వాటు ప‌డ్డాక అప్పుడు రేట్లు పెంచేస్తున్నారు.


ఈ వ్య‌స‌నం నుంచి బ‌య‌ట‌కు రాలేని విద్యార్థులు వీటి కోసం ఎంత‌కు అయినా తెగిస్తున్నారు. చివ‌ర‌కు బంగారం లాంటి త‌మ భ‌విష్య‌త్తును నాశ‌నం చేసుకుంటున్నారు. ఈ క్ర‌మంలోనే వారు డ్ర‌గ్స్ కొనుగోలు చేసేందుకు ఇంట్లో అబ‌ద్ధాలు ఆడి డ‌బ్బులు తీసుకోవ‌డం నుంచి చివ‌రకు దొంగ‌త‌నాలు, ఇత‌ర జూదాల‌కు కూడా అల‌వాటు ప‌డుతున్నారు. హైదరాబాద్ లో పోలీసులు కాస్త కఠినంగా వ్యవహరించడంతో విజయవాడలో ఉండే ధనికుల పిల్లలను లక్ష్యంగా చేసుకుని పావులు కదుపుతున్నాయి ఈ ముఠాలు.


విజ‌య‌వాడ‌లో ఉండే నాలుగు ప్ర‌ధాన కాలేజీల‌తో పాటు ప‌క్క జిల్లాలో ఉండే రెండు ప్రధాన యూనివ‌ర్సిటీల్లో ఎక్కువగా విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని డ్రగ్స్ ముఠాలు పని చేస్తున్నాయి అనే ఆరోపణలు వినపడుతున్నాయి. ఈ ముఠాల‌ను గురించి పోలీసులు ఇప్ప‌టికే హెచ్చ‌రిక‌లు జారీ చేయ‌డంతో విద్యార్థుల త‌ల్లిదండ్రులు తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు.  ఇక ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారితో స్నేహం చేసే విష‌యంలో కూడా జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని విద్యార్థుల‌కు పోలీసులు సూచ‌న‌లు జారీ చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: