పంతాలు వీడలేదు. చర్చలు జరగలేదు. బీజేపీ, శివసేన మధ్య సమస్య కొలిక్కి రాలేదు. బీజేపీకి పెద్దగా ఆప్షన్స్‌ కూడా లేవు. మరి రేపటి బలపరీక్ష ఎలా ఎదుర్కోబోతోంది..? మ్యాజిక్‌ ఫిగర్‌ను చేరుకుంటుందా..? బలనిరూపణలో విఫలమైతే.. గవర్నర్‌ నిర్ణయం ఎలా ఉండబోతోంది..?


సోమవారమే బలపరీక్ష. ఇప్పటికే మహారాష్ట్ర గవర్నర్‌ బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు. బలం నిరూపించుకోవాలని ఆదేశించారు. దీంతో బీజేపీ మద్ధతు కూడగట్టడంలో తలమునకలైంది. ముంబైలో సమావేశమైన కోర్‌ కమిటీ... ఓటింగ్‌పై చర్చించారు. ప్రభుత్వ ఏర్పాటుకు 145 మంది సభ్యుల బలం కావాలి. కానీ బీజేపీకి 105 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మ్యాజిక్ ఫిగర్‌ను చేరుకోవాలంటే ఇంకా 40 మంది ఎమ్మెల్యేల మద్ధతు కావాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో అంతమంది మద్ధతు కూడగట్టడం అసాధ్యమే. కాంగ్రెస్‌, ఎన్‌సీపీ నుంచి ఎమ్మెల్యేలను లాగుదామనుకున్నా.. ఆ అవకాశం లేదు. ఆ రెండు పార్టీలు తమ ఎమ్మెల్యేలతో క్యాంపు పెట్టాయి. 


బీజేపీ ముందున్నది ఒకే ఒక ఆప్షన్‌.. అది శివసేన. ఈ రెండు పార్టీలు మిత్రపక్షాలైనా... నిత్యం గొడవలే. రొటేషన్‌ పద్ధతిలో సీఎం పదవి చేపట్టాలని శివసేన డిమాండ్ చేస్తుండగా... బీజేపీ ససేమిరా అంటోంది. ఇదే విషయంలో రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం కూడా నడిచింది. బీజేపీ మెట్టు దిగేందుకు సిద్ధంగా లేదు. శివసేన కూడా పట్టువదలట్లేదు. ఇలాంటి సమయంలో ఈ రెండు పార్టీల మధ్య సయోధ్య కుదురుతుందా లేదా అనేది సస్పెన్స్‌. బీజేపీ బలనిరూపణలో విఫలమైతే.. రెండో అతిపెద్ద పార్టీ శివసేనను గవర్నర్‌కు ఆహ్వానించే అవకాశం ఉంది. ఐతే.. బీజేపీ అధిష్టానం మహారాష్ట్రను అంత ఈజీగా వదలుకుంటుందా.. అన్నది ఆసక్తికరంగా మారింది. రేపటి బలపరీక్షపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ఏ పార్టీ అధికారంలోకి వస్తుందా.. అని అందరూ ఆసక్తితో ఎదురు చూస్తున్నారు.  



మరింత సమాచారం తెలుసుకోండి: