ముఖ్య‌మంత్రి కార్యాల‌యం. ఇటీవ‌ల రెండు మూడు వారాలుగా ఏపీ సీఎంవో వార్త‌ల్లో నిలుస్తోంది. గ‌డిచిన రెండేళ్లుగా ఢిల్లీలోని ఆంధ్రా భ‌వ‌న్ రెసిడెంట్ క‌మిష‌న‌ర్‌గా ఉన్న సీనియ‌ర్ ఐఏఎస్‌ ప్ర‌వీణ్ ప్ర‌కాశ్ ను జ‌గ‌న్ ఇటీవ‌ల సీఎంవోలో నియ‌మించుకున్నారు. అయితే, అప్ప‌టి నుంచి ఈ కార్యాల‌యం వార్త‌ల్లోకి ఎక్కుతోంది. దీనికి కార‌ణం ఎవ‌రు?  సీఎంవో వ‌ర్గాలు ఏమంటున్నాయి? అనేది ఆస‌క్తిగా మారింది. విష‌యంలోకి వెళ్తే.. సాధార‌ణ ప‌రిపాల‌న శాఖ‌లోని పొలిటిక‌ల్ వింగ్ ముఖ్య‌మంత్రికి స‌ల‌హాలు, సూచ‌న‌లు చేస్తుంది. దీనికి ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీగా ప్ర‌వీణ్ ప్ర‌కాశ్ నియ‌మితుల‌య్యారు.


అయితే, ఆయ‌న వ‌చ్చిన త‌ర్వాత ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శికి, జేఏడీ పొలిటిక‌ల్ సెక్ర‌ట‌రీకి మ‌ధ్య గ్యాప్ పెరిగింది. క‌మ్యూనికేష‌న్ విష‌యంలో భారీ అంత‌రం చోటు చేసుకుంది. ఇది ఏకంగా ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య ద‌ర్శి ఎల్వీ సుబ్ర‌హ్మ‌ణ్యాన్ని ఆక‌స్మికంగా బ‌దిలీ చేసే వ‌ర‌కు వ‌చ్చింది. దీనికి ప్ర‌ధానంగా ప్ర‌వీణ్ ప్ర‌కాశ్ బాధ్యుడ‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. విలేజ్ కోర్టులు, జీవ‌న సాఫ‌ల్య‌ పుర‌స్కారాల విష‌యంలో ఏర్ప‌డిన క మ్యూనికేష‌న్ గ్యాప్ ఏకంగా .. ఎల్వీని ప‌క్క‌కు పెట్టేవ‌ర‌కు వ‌చ్చింది. దీని వెనుక ప్ర‌వీణ్ ప్రావీణ్య‌మే కార ణ‌మే వాద‌న కూడా బ‌లంగానే ఉంద‌ని సీఎంవో వ‌ర్గాలు చెబుతున్నాయి. ఇది ఇంకా తెర‌మ‌రుగు కాక‌ముందుగానే.. ఇప్పుడు మ‌రో సంచ‌ల‌నానికి ప్ర‌వీణ్ తెర‌దీశారు.


తన శాఖ జేఏడీ పొలిటిక‌ల్ వింగ్‌లోని కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు.. రెండు నెలలుగా జీతాలు రావడం లేదు. దీంతో.. ఆర్థిఖ శాఖ తీరుపై తీవ్ర అసంతృప్తితో ఆయన ఓ లేఖ రాశారు. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులందరికీ.. జీతాలు ఇచ్చిన తర్వాతే తనకు జీతం ఇవ్వాలని.. ఆ లేఖ సారాంశం. దీంతో.. ఇతర శాఖల ఉన్నతాధికారులు.. ఆర్థిక శాఖ అధికారులు.. తలు పట్టుకుంటున్నారని ఉద్యోగ వ‌ర్గాలు చెబుతున్నాయి. వాస్త‌వానికి రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితి బాగోక పోవ‌డం, గ‌త ప్ర‌భుత్వం విచ్చ‌ల‌విడిగా చేసిన దుబారా వ్య‌యం కార‌ణంగా.. రెగ్యులర్ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి ప్రభుత్వం తంటాలు పడుతోంది.


దీంతో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు ఎప్పుడు అందుబాటులో ఉంటే.. అప్పుడిస్తున్నారు. ఇది దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ జ‌రుగుతున్న‌దే. అయితే, ఇప్పుడు తన శాఖ ఉద్యోగులు… తమ జీతాల విషయంపై ఒత్తిడి చేస్తూండటంతో.. ప్రవీణ్ ప్రకాష్.. తన చేతుల్లో ఏమీ లేదని చెప్పడానికో… లేక తన పలుకుబడి కారణంగా.. లేఖ రాస్తే.. జీతాలు ఇస్తారని అనుకున్నారో కానీ.. తన శాఖలో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ వారందరికీ ఇచ్చిన తర్వాతనే తనకు జీతాలివ్వాలని.. కోరుతూ.. డ్రాయింగ్ డిస్బ‌ర్స్ విభాగానికి లేఖ రాశారు. అయితే, ఇది సీఎంవో కార్య‌ల‌యాన్ని మ‌రోసారి వివాదంలోకి లాగ‌డ‌మే అవుతుంద‌ని అంటున్నారు సీనియ‌ర్ అధికారులు. మ‌రి దీనిపై సీఎం ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: