రాజ‌కీయాల్లో ఎప్పుడు ఎలాంటి ప‌రిస్థితులైనా రావొచ్చు. ఎంత బ‌ల‌మైన పార్టీ అయినా.. కొన్నిసార్లు చిన్నా చిత‌కా పార్టీల‌తో ఒక్క‌టి రెండు సీట్ల కోసం జ‌త‌క‌ట్టిన ప‌రిస్థితులు ఈ దేశ రాజ‌కీయాల్లో కొత్త‌కాదు. అయితే, త‌మ‌కు ఎలాంటి అవ‌సరం లేక‌పోయినా.. ఎలాంటి మ‌ద్ద‌తు అక్క‌ర లేకున్నా కూడా.. వైసీపీ ఇప్పుడు క మ్యూనిస్టుల‌తో చెలిమి కోరుకుంటోందా?  భారీ మెజారిటీ సొంతం చేసుకున్న వైసీపీ 151 సీట్ల‌తో ప్ర‌భుత్వా న్ని ఏర్పాటు చేసుకుంది. ఇక‌, జ‌న‌సేన‌తో చెలిమి చేసిన క‌మ్యూనిస్టులు క‌నీసం ఒక్క‌టంటే ఒక్క చోట కూడా విజ‌యం సాధించ‌లేక పోయారు.


క‌నీసం అస్తిత్వాన్ని నిరూపించుకోలేక చ‌తికిల‌ప‌డుతున్నారు. అలాంటి క‌మ్యూనిస్టుల‌ను ఇటీవ‌ల ఎన్ని క‌ల్లో ఘోరంగా ఓడిపోయిన పాత మిత్రుడు చంద్ర‌బాబు సైతం క‌నీసం ప‌ల‌క‌రించ‌డం లేదు. ఇక‌, తాజా ఎన్నిక ల్లో పొత్తు పెట్టుకున్న జ‌న‌సేన కూడా క‌మ్యూనిస్టుల‌ను క‌లుపుకొని వెళ్ల‌డం లేదు. అంతేకాదు, క‌మ్యూనిస్టులు ఎలా ఉన్నార‌నే త‌లంపు కూడా చేయ‌డం లేదు. అలాంటి పార్టీలో ఒక్క‌సారిగా మెరుపు! నిత్యం ఎంతో బిజీగా ఉండే వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్ నేరుగా క‌మ్యూనిస్టుల ఇంటి త‌లుపు త‌ట్టారు. ఈ అనూహ్య‌ప‌రిణామం రాష్ట్ర రాజ‌కీయాల్లో సంచ‌ల‌నం రేపింది.


సీపీఎం రాష్ట్ర కార్య‌ద‌ర్శి పిన్నెల్లి మ‌ధు ఇంటికి స్వ‌యంగా సీఎం జ‌గ‌న్‌, ఆయ‌న రాజ‌కీయ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డితో క‌లిసి వెళ్ల‌డం ఆస‌క్తిగా మారింది. మోకీళ్ల నొప్పుల‌కు ఆప‌రేష‌న్ చేయించుకున్న మ‌ధును సీఎం ప‌రామ‌ర్శించేందుకు వెళ్లారు. ప్ర‌ధాన మీడియాలో ఈ వార్తకు చోటు ద‌క్కింది. అయితే, ఇక్క‌డ ఈ ఒక్క అంశ‌మే కాదు.. జ‌గ‌న్ త‌న రాజ‌కీయ జీవితంలో ఇప్ప‌టి వ‌ర‌కు ఎప్పుడూ కూడా క‌మ్యూని స్టుల గురించి మాట్లాడింది లేదు. సుదీర్ఘ పాద‌యాత్ర‌లో కూడా క‌మ్యూనిస్టుల విమ‌ర్శ‌ల‌కు కూడా ఆయ‌న ఎప్పుడూ జ‌వాబు చెప్ప‌లేదు.


త‌న‌తో క‌లిసేందుకు అటు 2014, ఇటు 2019 ఎన్నిక‌ల్లోనూ క‌మ్యూనిస్టులు మొగ్గు చూపారు. అయినా జ‌గ‌న్ ద‌గ్గ‌ర‌కు రానివ్వ‌లేదు. అలాంటి జ‌గ‌న్ అనూహ్యంగా ఇప్పుడు నేరుగా సీపీఎం రాష్ట్ర కార్య‌ద‌ర్శి ఇంటికి వెళ్ల‌డం సంచ‌ల‌నం కాక‌మ‌రేంటి? ఇక్క‌డే ఏదో జ‌రుగుతోంద‌నే చ‌ర్చ తెర‌మీదికి వ‌స్తోంది. వ‌చ్చే ఏడాది స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు ఉన్నాయి. దీనిని దృష్టి లో పెట్టుకునే జ‌గ‌న్ త‌న శ‌త్రువుల సంఖ్య‌ను త‌గ్గించుకునేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నారా? అనే సందేహాలు వ‌స్తున్నాయి. మ‌రి .. ఈ అనూభ్య ``ప‌రామ‌ర్శ‌`` వెనుక ఉన్న రాజ‌కీయం ఏంటో తెలియాలంటే.. కొన్నాళ్లు వెయిట్ చేయాల్సిందే.



మరింత సమాచారం తెలుసుకోండి: