హైకోర్టు ఆదేశాల నేపధ్యం లో ఆర్టీసీ సమ్మె పరిష్కారం పై రాష్ట్ర ప్రభుత్వం డైలమా పడినట్లు కన్పిస్తోంది . చర్చల ద్వారా సమస్యను పరిష్కరించాలన్న హైకోర్టు , ప్రభుత్వం పరిష్కరించకపోతే తామే పరిష్కరించాల్సి వస్తుందని హెచ్చరించిన విషయం తెల్సిందే . సోమవారం మరోసారి ఆర్టీసీ సమ్మె పై దాఖలైన  పిటిషన్ పై న్యాయస్థానం  విచారించనుంది. కోర్టు ఆదేశాల అమలు దిశగా ప్రభుత్వం ఇప్పటి వరకూ తీసుకున్న చర్యలేమిటన్నది ఆసక్తికరంగా మారింది . ఇదే విషయాన్ని కోర్టు ప్రశ్నిస్తే ప్రభుత్వం ఏమి సమాధానం చెబుతుందన్నది హాట్ టాఫిక్ మారింది .


మరొకవైపు ఈ కేసులో  కేంద్రం తరుపున వాదనలు వినిపించిన అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ రాజేశ్వర్ రావు ఆర్టీసీ విభజన జరగలేదని న్యాయస్థానానికి నివేదించారు . టీఎస్ ఆర్టీసీకి చట్టబద్ధతే లేదని ఆయన  పేర్కొన్నారు . దీనితో   టీఎస్ ఆర్టీసీ ఉనికే  ప్రశ్నార్ధకంగా మారిన నేపధ్యం లో, టీఎస్ ఆర్టీసీ ఆవిర్భావానికి దారితీసిన పరిస్థితులను కోర్టుకు నివేదించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది . దానికితోడు టీఎస్ ఆర్టీసీకి ఉన్న చట్టబద్ధతను న్యాయస్థానానికి నివేదించాలని నిర్ణయించింది . సోమవారం ఒకవేళ కోర్టు ఏదైనా స్పష్టమైన ఆదేశాలను జారీ చేస్తే సుప్రీం కోర్టును ఆశ్రయించాలని రాష్ట్ర ప్రభుత్వం సూచన ప్రాయంగా ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది .


 సమ్మె విరమణకు ప్రభుత్వ పక్షాన ఇప్పటికే అన్ని చర్యలు తీసుకున్నట్లు , ఇక సమ్మె విరమణకు ప్రభుత్వం చేసేది ఏమిలేదని ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం రాత్రి నిర్వహించిన అత్యున్నత సమావేశం లో పేర్కొన్నట్లు తెలుస్తోంది . ఆర్టీసీ కార్మికులు  సమ్మె ప్రారంభించడానికి ముందే ఐఏఎస్ లతో అత్యున్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేసి చర్చల ప్రక్రియ ప్రారంభించినట్లు , అయినా కార్మికులు చర్చల్లో పాల్గొనకుండా సమ్మెకు వెళ్లారని ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం . ఏది ఏమైనా కోర్టు నిర్ణయం వ్యతిరేకంగా వస్తే సుప్రీం కు వెళ్లాలన్నది రాష్ట్ర ప్రభుత్వ యోచనగా ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి . 

మరింత సమాచారం తెలుసుకోండి: