మొన్నటి ఎన్నికల్లో తగిలిన దెబ్బతో జనసేనలో గందరగోళం పెరిగిపోయింది. 140 ఎంఎల్ఏ స్ధానాల్లో పోటి చేస్తే గెలిచింది ఒక్క స్ధానంలో మాత్రమే. పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పోటి చేసిన రెండు నియోజకవర్గాల్లోనూ ఓడిపోవటంతో పార్టీ నేతలకు మైండ్ బ్లాంక్ అయిపోయింది. ఈ విషయం ఇలాగుంటే తొందరలో జరగబోయే స్ధానిక సంస్దల ఎన్నికల విషయంలో కూడా గందరగోళం పెరిగిపోతోందట.

 

స్ధానిక సంస్ధల ఎన్నికల్లో కూడా  పరిషత్ ఎన్నికలు జరపాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. అంటే సర్పంచులు, మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు జరుగుతాయి. దాదాపు 16 వేల సర్పంచులు, సుమారు 7 వేల ఎంపిటిసి, జడ్పిటిసిలకు జరగబోయే ఎన్నికలకు పార్టీ తరపున పోటీ చేసే విషయంలో అయోమయం నెలకొంది.

 

పార్టీ స్టాండ్ ఏమిటో ఇప్పటి వరకు పవన్ నేతలెవరితోను చర్చించలేదని సమాచారం. ఒకవైపు అధికార వైసిపి రాబోయే ఎన్నికల్లో సత్తా చాటేందుకు రంగం సిద్దం చేసుకుంటుంటే ప్రతిపక్షాల్లో మాత్రం గందరగోళం కనిపిస్తుండటమే విచిత్రంగా ఉంది. చంద్రబాబునాయుడు అంటే చివరి నిముషం వరకూ ఏ విషయాన్ని తేల్చేరకం కాదని అందరికీ తెలిసిందే.

 

బహుశా అదే పద్దతిలో తాను కూడా వెళ్ళాలని అనుకున్నారో ఏమో పవన్ . మొన్నటి సాధారణ ఎన్నికల్లోనే జనసేన బలమెంతో అందరికీ ఓ అంచనా వచ్చింది. రాష్ట్రంలోని సుమారు 3.5 కోట్ల ఓట్లలో జనసేనకు దక్కింది కేవలం 16 లక్షల ఓట్లు మాత్రమే. అంటే కాస్త అటు ఇటుగా 3.5 శాతం. వామపక్షాలు, బిఎస్పీతో కలుపుకుంటు ఓట్ల శాతం 6కు చేరుకుంది.

 

ఇదే ఓట్లు గనుక మళ్ళీ జనసేనకు పడితే  ఎక్కడైనా నాలుగైదు సర్పంచు స్ధానాలను గెలుచుకోవచ్చేమో. గ్రామస్ధాయిలో పార్టీని బలోపేతం చేస్తేనే పార్టీకి మంచి ఫలితాలు వస్తాయి. కానీ పవన్ ఆ దిశగా ఆలోచిస్తున్నట్లు కనబడటం లేదు. ఎంతసేపు చంద్రబాబు కీ ఇచ్చినపుడల్లా జగన్మోహన్ రెడ్డి మీద ఎగిరెగిరి పడటమే కనిపిస్తోంది. అందుకే జనసేన నేతల్లో గందరగోళం పెరిగిపోతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: