దేశ‌వ్యాప్తంగానే కాకుండా...ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉత్కంఠ‌ను రేకెత్తిస్తున్న అయోధ్య కేసుకు ముగింపు ప‌డిన సంగ‌తి తెలిసిందే. కోట్ల మంది హిందువుల మనోభావాలను గౌరవిస్తూ.. వివాదాస్పద స్థలాన్ని రామాలయ నిర్మాణానికి అప్పగించింది. ముస్లింలకు ఉపశమనం కలిగించేలా.. మసీదు నిర్మాణం కోసం అయోధ్య పట్టణంలో ఎక్కడైనా ప్రముఖ ప్రాంతంలో ఐదు ఎకరాల స్థలాన్ని కేంద్రప్రభుత్వంగానీ, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంగానీ కేటాయించాలని ఆదేశాలు జారీచేసింది. దశాబ్దాలుగా దేశాన్ని మతాలవారీగా విభజించిన అయోధ్యలోని రామజన్మభూమి-బాబ్రీమసీదు వివాదంలో.. ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం ఏకగ్రీవ తీర్పును వెలువరించింది.  అయితే, ఇలా తీర్పు వచ్చిన క్రమంలో భారత్ లో భారీ ఉగ్రదాడులు జరిగే అవకాశాలున్నాయని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. 


అయోధ్య తీర్పు ఏ క్షణమైనా వెలువడనుందన్న వార్తలు వచ్చిన దగ్గరి నుంచి జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ కదలికలు తీవ్రమయ్యాయి. ఇప్పుడు తీర్పు రావడంతో భారీ దాడులకు పాల్పడేందుకు రెడీగా ఉందని ఐబీ, రా సంస్థలు హెచ్చరించాయి. ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలపై దాడులు జరగవచ్చని తెలిపాయి. మ‌రోవైపు, ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ న‌మ్మిన‌బంటు, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ నివాసంలో హిందు-ముస్లిం మత పెద్దల భేటీ జ‌రిగింది.  అయోధ్యపై సుప్రీం కోర్టు తీర్పును అందరూ స్వాగతించాలన్నారు. ఎలాంటి వివాదాలకు పోకూడదని కోరారు. శాంతి, సద్భావవను కొనసాగించాలన్నారు. హిందు-ముస్లిం మత పెద్దలు, సాధువులతో సమావేశంలో యోగా గురు బాబా రాందేవ్, చిన జీయర్ స్వామి, స్వామి ప్రమత్మానంద్, ముస్లింలలోని షియా, సున్నీ వర్గాలకు చెందిన గురువులు కూడా పాల్గొన్నారు. అందరూ శాంతిని పాటించాలని దోవల్ కోరారు.


కాగా, భారత ప్రజాస్వామ్యం సజీవం, శక్తిమంతమైందని అయోధ్య తీర్పు రుజువు చేసిందని ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ పేర్కొన్న సంగ‌తి తెలిసిందే. ``అయోధ్య తీర్పును దేశంలోని అన్ని వర్గాలు స్వాగతించాయి. ఇది పురాతన భారత సంప్రదాయమైన మైత్రి, అన్యోన్యతలను ప్రతిబింబించింది. సరిగ్గా 30 ఏండ్ల క్రితం నవంబర్ తొమ్మిదో తేదీన బెర్లిన్ గోడ కూల్చివేతతో జర్మనీ ఏకమైంది. ఇదే రోజు కర్తార్‌పూర్ కారిడార్ ప్రారంభమైంది. అయోధ్యపై తీర్పు వెలువడిందీ ఇదే రోజు. కలిసి ముందడుగు వేయాలని నవంబర్ 9 మనకు గుణపాఠం నేర్పింది.`` అని ఆయ‌న పేర్కొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: