తెలంగాణాలో ఆర్టీసీ కార్మికుల ఆందోళన రోజు రోజుకు ఉధృతం అవుతుంది. నేటికి సమ్మె మొదలు పెట్టి 37 రోజులు కావస్తున్నా సమ్మె విషయంలో ప్రభుత్వం గాని, కార్మికులు గాని మెట్టుదిగకపోవడంతో ఇప్పుడున్న పరిస్దితుల్లో సమ్మై ఇంకా చాలా క్లిష్టంగా మారుతుంది. రాష్ట్రంలో ఇప్పుడు నెలకొన్న పరిస్దితులు ఎక్కడివరకు దారి తీస్తాయో తెలియడం లేదు. ఇక కార్మికులు తమ ఆందోళనలో భాగంగా చలో ట్యాంక్‌బండ్‌ కార్యక్రమంలో కార్మికులు ప్రాణాలను లెక్క చేయకుండా వందల సంఖ్యలో పోలీసు నిర్బంధాన్ని ఛేదించి గమ్యం చేరిన విషయం తెలిసిందే.


అది విజయవంతమవడంతో సమ్మె కార్యాచరణకు మరింత పదునుపెట్టాయి కార్మిక సంఘాలు. ఇందులో భాగంగా ఈనెల 18న రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ‘సడక్‌ బంద్‌’ నిర్వహించాలని నిర్ణయించాయి. ఇది దాదాపు రాష్ట్ర బంద్‌ తరహాలో ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నాయి. మొత్తంగా రాష్ట్ర రహదారులన్నింటిని దిగ్బంధం చేయటం ద్వారా ప్రభుత్వానికి సత్తా చాటాలని భావిస్తున్నారు. ఇకపోతే ఆర్టీసీ విషయమై హైకోర్టు లో కేసు తుది తీర్పు వెలువడనే లేదు. అప్పుడే తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళతాననడం సరికాదని ఆర్టీసీ జేఏసీ చైర్మన్‌ అశ్వత్థామ రెడ్డి అన్నారు.


విద్యానగర్‌లోని ఎంప్లాయిస్‌ యూనియన్‌ కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సమ్మె కొనసాగింపులో భాగంగా తదుపరి ఉద్యమ కార్యాచరణను ప్రకటించారు. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్ల ఎదుట నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. మంగళవారం జేఏసీ ముఖ్య నేతల నిరాహార దీక్షలు ఉంటాయన్నారు. 18న సడక్‌ బంద్‌ నిర్వహిస్తామన్నారు. త్వరలో ఢిల్లీ వెళ్లి మానవ హక్కుల కమిషన్‌ను, మహిళా హక్కుల కమిషన్‌ను కలిసి ఫిర్యాదు చేస్తామని చెప్పారు.


‘చలో ట్యాంక్‌బండ్‌’ సందర్భంగా జరిపిన దమనకాండపై రెండు రోజులపాటు ఫొటో ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. కార్మికుల కోసం చేస్తున్న సమ్మెలో మావోయిస్టులు పాల్గొన్నారని ఆపాదించడం దురదృష్టకరం, ఈ సమ్మెలో ఆర్టీసీ జేఏసీ నేతలు, కార్మికులు, ప్రజా సంఘాలు మాత్రమే ఇందులో పాల్గొన్నాయని వివరించారు. ప్రభుత్వం ఇప్పటికైనా చర్చలకు పిలవాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు మంత్రులు, ఎమ్మెల్యేలు ఒత్తిడి తేవాలని కోరారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: