మాజీ ఎన్నికల ప్రధానాధికారి టీఎన్‌ శేషన్ ఇక లేరు. వృద్ధాప్య సమస్యలతో చెన్నైలో తుది శ్వాస విడిచారు. వృద్ధాప్య సమస్యలతో కొన్నేళ్లుగా చెన్నైలోని తన స్వగృహంలో ఉంటున్న ఆయన.. ఆదివారం రాత్రి 9.30 గంటలకు తుది శ్వాస విడిచారు. కేరళలోని పాలక్కాడ్‌ జిల్లా తిరునెళ్లాయిలో 1932 డిసెంబరులో శేషన్ జన్మించారు. ఫిజిక్స్‌లో గ్రాడ్యుయేషన్‌ చేశారు.


ఎన్నికల సంఘానికి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన వ్యక్తి టీఎన్‌ శేషన్. రూల్స్ ను నూటికి నూరు శాతం పాటిస్తే దాని ప్రభావం ఎలా ఉంటుందో రుచి చూపించిన వాడు. అసలు భారత దేశంలో ఎన్నికల సంఘం అంటూ ఒకటి ఉందని.. దానికి ఇన్ని అధికారాలున్నాయని ప్రజలకు చాటిచెప్పినవాడు టీఎన్ శేషన్.


ఎన్నికల సంస్కరణలకు టీఎన్ శేషన్ ఆద్యుడు. ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఇప్పుడు ఉపయోగిస్తున్న గుర్తింపు కార్డు ఐడియా ఆయనదే. ఎన్నికల నిబంధనావళి ఒకటుందని నాయకులకు గుర్తు చేసినవాడు. తనకున్న అధికారాన్ని సమర్థంగా ఉపయోగించి.. నాయకులను హడలెత్తించాడు టీఎన్ శేషన్.


ఎన్నికల ప్రధాన కమిషనర్‌కు ఎన్ని అధికారాలు ఉంటాయో దేశానికి చూపించారు. 1990 డిసెంబరు 12 నుంచి 1996 డిసెంబరు 11 వరకూ ఆరేళ్లపాటు ఆయన సీఈసీగా పని చేశారు. ఎన్నికల అక్రమాలను సంస్కరించేందుకు శేషన్‌ నూటికి నూరు శాతం ప్రయత్నించారు. నిబంధనల విషయంలో చండశాసనుడుగా పేరు తెచ్చుకున్నారు. అప్పట్లో ఎన్నికలొస్తే హడావిడి అంతా ఇంతా కాదు. గోడలన్నీ ఖరాబయ్యేవి.. రాత్రీ పగలూ తేడా లేకుండా మైకులు హోరెత్తేవి.. అభ్యర్థులు విచ్చలవిడిగా ఖర్చు చేసేవారు.


శేషన్ వీటిన్నింటినీ కట్టడి చేసేవాడు. ఎన్నికల నిబంధనావళి తూచా తప్పకుండా అమలు కావడానికి చర్యలు తీసుకున్నారు. అభ్యర్థుల ఖర్చుపై పరిమితి విధించారు. ఎవరైనా ఓటర్లను ప్రలోభపెట్టినా.. అలాంటి అక్రమాలపై ఉక్కుపాదం మోపారు. మద్యం పంపిణీని నిలువరించారు. నిబంధనలను పాటించనందుకు కొన్ని గంటల్లో పోలింగ్ జరగబోయే ఎన్నికలను కూడా ఆయన ఓసారి రద్దు చేసేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: