సామాన్యులకు ఉల్లి ధరలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. హైదరాబాద్ మార్కెట్ లో కిలో ఉల్లి ధర 60 రూపాయల నుండి 80 రూపాయలు పలుకుతోంది. మరో పది రోజుల్లో ఉల్లి ధర 100 రూపాయలు పలికే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో కిలో ఉల్లి 50 రూపాయల నుండి 75 రూపాయలు పలుకుతోంది. ఏపీలో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేసి భారీమొత్తంలో ఉల్లిని స్వాధీనం చేసుకున్నారు. 
 
మార్కెట్ లో ఉల్లి కొరత ఏర్పడటమే భారీగా ఉల్లి ధరలు పెరగటానికి కారణమని వ్యాపారులు చెబుతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ హోల్ సేల్ మార్కెట్ లో ఉల్లి ధర 5500 రూపాయల నుండి 6000 రూపాయలు పలుకుతోంది. కర్నూల్ మార్కెట్ లో మాత్రం ఉల్లి ధర 2000 రూపాయల నుండి 4000 రూపాయలు పలుకుతోంది.  మహారాష్ట్ర రాష్ట్రంలో ఉల్లి పంటలు భారీ వర్షాల వలన పాడైపోయినట్లు వ్యాపారులు చెబుతున్నారు. 
 
మరోవైపు కేంద్రం ఉల్లి ధరలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. దేశంలో పెరిగిన ఉల్లి ధరలను విదేశాల నుండి ఉల్లిని దిగుమతి చేసుకోవటం ద్వారా నియంత్రించాలని కేంద్రం భావిస్తోంది. ఇరాన్, టర్కీ, ఈజిప్టు నుండి ఉల్లిని తెప్పించే విధంగా కేంద్రం చర్యలు చేపడుతోంది. ఈ ఉల్లి మార్కెట్ లోకి వస్తే మాత్రమే ఉల్లి ధరలు తగ్గే అవకాశం ఉందని తెలుస్తోంది. కర్నూలు జిల్లా మార్కెట్ కు మార్కెట్ యార్డ్ సామర్థ్యానికి మించి సరుకు వస్తోంది. 
 
కర్నూలు మార్కెట్ లో వేలంలో జాప్యం జరగటం వలన ఉల్లి సరుకు నాణ్యత తగ్గుతోందీ. వ్యాపారులు నాణ్యత తగ్గుతోందంటూ రేటును తగ్గిస్తూ ఉండటంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. మార్కెట్ లో ధరలు బాగానే ఉన్నా వేలంలో జాప్యం జరుగుతూ ఉండటంతో నష్టపోతున్నామని రైతులు చెబుతున్నారు. ఏపీలో గతంలో మార్కెటింగ్ శాఖ ద్వారా ఉల్లి తెప్పించి 25 రూపాయలకు కిలో చొప్పున విక్రయించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మార్కెటింగ్ శాఖ ద్వారా ఉల్లి అమ్మకాలకు ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: