రాష్ట్రంలో తెలుగుమీడియం, ఇంగ్లీషు మీడియం అన్నది హాట్ టాపిక్ అయిపోయింది. 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు ఇంగ్లీషు మాధ్యమంలోపాఠాలు చెప్పాలని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉత్తర్వలు జారీ చేయటంతో మంటలు రాజుకుంటోంది. సరే అన్ని వైపుల నుండి ప్రధానంగా ఉపాధ్యాయసంఘాల నుండి వచ్చిన అభ్యంతరాల తర్వాత ముందిచ్చిన ఉత్తర్వుల్లో కాస్త సవరణలు చేసింది లేండి.

 

ఇక్కడ విషయం ఏమిటంటే జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తు చాలామంది రాజకీయనేతలు, సామాజిక ఉద్యమకారులు పెద్ద ఎత్తున ఉద్యమబాట పట్టారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే తెలుగు భాష కోసం ఉద్యమాలు చేస్తున్న వారిలో అత్యధికులు తమ పిల్లలను మాత్రం ఇంగ్లీషు మీడియా స్కూళ్ళల్లోనే చదివిస్తున్నారు.

 

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మనవలు ఇంగ్లీషు మీడియంలోనే చదువుతున్నారు. ఆయన కూతురు నిర్వహిస్తున్న స్వర్ణభారతి ట్రస్టు కూడా ఇంగ్లీషు మీడియం స్కూలునే నడుపుతోంది. అలాగే జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా తన పిల్లలను ఇంగ్లీషు మీడియంలోనే చదివిస్తున్నారు. మీడియా ప్రముఖుడు రామోజీరావు ఆధ్వర్యంలో నడుస్తున్న స్కూలు కూడా ఇంగ్లీషు మీడియమే కావటం విచిత్రం.

 

వీరేకాదు తెలుగుభాష కోసం ఉద్యమాలు జరగాలని పిలుపినిస్తున్న చాలామంది తమ పిల్లలను లేదా వారసులను ఇంగ్లీషు మీడియంలోనే చదిస్తున్నారు. అంటే తమ సంతానం లేదా వారసులు మాత్రం ఇంగ్లీషు మీడియంలోనే చదవాలి. తాము మాత్రం ఇంగ్లీషు మీడియం స్కూళ్ళనే నడపాలి. కానీ మిగిలిన జనాలు మాత్రం తెలుగు మీడియం స్కూళ్ళల్లోనే చదువుకోవాలా ?

 

అంటే వీళ్ళు చెప్పే నీతులు ఎలాగున్నాయంటే ఆర్ధికస్తోమత లేని వాళ్ళు మాత్రమే తెలుగు మీడియం స్కూళ్ళల్లోనే చదువుకోవాలన్నట్లుగా ఉంది. వీళ్ళు చెప్పే నీతులు నేతిబీరకాయలో నెయ్యి ఉన్నట్లే ఉంది. నేతి బీరకాయలో నెయ్యి ఎలా ఉండదో వీళ్ళ మాటల్లో, ఉద్యమాల్లో కూడా నీతి అంతే ఉండదని జనాలకు అర్ధమైపోతోంది. తెలుగుకు ఇస్తున్న ప్రాధాన్యత గురించి వైసిపి నేతలు కేసియార్ ను చూసి నేర్చుకోవాలని పవన్ ఓ ట్వీట్ పెట్టారు. కానీ పవన్ కు తెలియనిదేమిటంటే కేసియార్ వారసులు చదువుతున్నది కూడా ఇంగ్లీషుమీడియంలోనే. అలాగే కుటుంబంసభ్యులు నడుపుతున్న స్కూలు కూడా ఇంగ్లీషు మీడియమే.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: