పవన్ కళ్యాణ్ వెండి తెర మీద పవర్ స్టార్. ఆయన అలా ఒక స్టెప్ వేస్తే చాలు హాల్లో అభిమానులు గోల పెడతారు, ఈల వేస్తారు. విలన్ని కౌంటర్ చేస్తూ తొక్క తీస్తా, తోలు తీస్తా అంటే  అభిమానులు అసలు సీట్లో కూర్చోలేరు. పవన్ నటనను అంతగా ప్రేమిస్తారు. తెర మీద  ఆయన ఎలా ఉన్నా వారికి ఇష్టమే. పవన్ స్టైల్ ఆఫ్ యాక్షన్ అంటూ తెగ మోజుపడతారు. అదే పవన్ జనసేనాని అవతారంలో  వస్తే మాత్రం వీరాభిమానులకు కూడా అసలు నచ్చడంలేదుట.


ఈ మాటలు అన్నది పవన్ అన్నా మెగా ఫ్యామిలీ అన్నా బాగా ఇష్టపడే వైసీపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. వైసీపీ ప్రభుత్వంలో పవన్ అభిమాని మంత్రి కావడం విచిత్రమే. అయితే ఆయన తాను సినిమాల వరకూ మాత్రమే పవన్ని అభిమానిస్తానని, రాజకీయాల్లో మాత్రం పూర్తిగా వ్యతిరేకిస్తానని అంటున్నారు. పవన్ డబుల్ స్టాండర్డ్ వైఖరి రాజకీయాల్లో ఎక్కడికక్కడ‌ కనబడుతోందని అనిల్ హాట్ కామెంట్స్ చేశారు


నిజాయతీతో రాజకీయం పవన్ చేయడం లేదని కూడా అనేశారు. పవన్ ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా కూడా జగన్నే తిడుతూ ఒక వైపే చూస్తున్నారని అనిల్ మండిపడ్డారు. అయిదేళ్ళ చంద్రబాబు పాలనలో ఎన్నో తప్పులు జరిగితే కనీసం ప్రశ్నించని పవన్ వంద రోజుల పాలన  కూడా కాకుండానే జగన్ని విమర్శించేందుకు రెడీ అయిపోయారని ఘాటైన‌ వ్యాఖ్యలే చేశారు. ధర్నాల వల్ల సమస్యలు తీరుతాయా అని మూడేళ్ళ క్రితం చెప్పిన పవన్ ఇపుడు తానే జనంలోకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారని, దీని ఏమనాలి అని ఆయన నిలదీశారు.


ఇక పవన్ కళ్యాణ్ చెబుతున్న దానికి చేస్తున్న దానికి అసలు పొంతన, పోలిక లేనేలేవని కూడా ఆయన అన్నారు. పవన్ జనసేన నాయకుడుగా ముందు నిలబడాలని, కానీ ఆయన వెనక ఉండి జనసైనికులను  ఎగదోస్తున్నారని అనిల్ ఫైర్ అయ్యారు. పవన్ నిజాయతీగా రాజకీయం చేస్తేనే ఆయనకూ, జనసేనకు ఫ్యూచర్ ఉంటుందని అన్నారు. మొత్తానికి మెగా ఫ్యామిలీ అంటే బాగా ఇష్టపడే మంత్రి అనిల్ రాజకీయాల్లో మాత్రం పవన్ హీరో కాడని పక్కా క్లారిటీతో చెప్పేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: