బాబ్రీ మ‌సీదు విష‌యంలో...సుప్రీంకోర్టు తీర్పుపై మజ్లిస్‌ పార్టీ అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ త‌న ప్ర‌శ్న‌ల ప‌రంప‌ర కొన‌సాగిస్తున్నారు. సుప్రీం తీర్పుపై ఆయ‌న స్పందిస్తూ, మిలాద్‌-ఉన్‌-నబీ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. దీంతోపాటుగా అసదుద్దీన్‌ పలు ట్వీట్లు చేశారు. ‘మీ ఇంటిని కూల్చివేసినప్పుడు మీరు కోర్టును ఆశ్రయిస్తే...ఆ ఇంటిని మీకు అప్పగిస్తారా లేక కూల్చివేసిన వారికి ఇస్తారా?’ అని ట్వీట్‌లో ఓవైసీ ప్రశ్నించారు.


బీజేపీ, ఆరెస్సెస్‌ కలిసి మరెన్నో మసీదులను మందిరాలుగా మార్చడానికి కుట్రలు చేస్తున్నాయని హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ విమర్శించారు. బాబ్రీ మసీదు సక్రమమా?.. అక్రమమా? అని మజ్లిస్‌ పార్టీ అధినేత ప్రశ్నించారు.  `తీర్పు పట్ల మేం అసంతృప్తిగా ఉన్నాం. బాబ్రీ మసీదుపై మాకు చట్టపరమైన హక్కు ఉన్నది. మసీదు కోసమే నా పోరాటం తప్ప స్థలంపై కాదు. బాబ్రీ మసీదు కట్టడం సక్రమమైతే, దాన్ని కూల్చిన వారికి ఆ స్థలాన్ని ఎలా అప్పగిస్తారు? అది అక్రమ కట్టడమైతే అద్వానీ తదిరులపై ఎందుకు విచారణ జరుపుతున్నారు? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. ఒకవేళ సక్రమమే అయితే మసీదును మాకు అప్పగించాలి. ’ అని వ్యాఖ్యానించారు. 


తీర్పును ముస్లింలు ఏ విధంగా తీర్పును స్వీక‌రించాల‌ని  ఎలా భావించాలని మజ్లిస్‌ పార్టీ అధినేత ``చాలా ఏళ్లుగా అక్కడ ఉన్న ఒక మసీదును కూల్చివేశారు. ఆ స్థలం రామ్‌లల్లాకు చెందుతుందని, అక్కడ మందిరం నిర్మించుకోవచ్చని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. మాకు ప్రత్యామ్నాయ స్థలం ఇవ్వాలని చెప్పి మమ్మల్ని అవమానించింది. మేం బిచ్చగాళ్లం కాదు.. గౌరవనీయమైన భారత పౌరులం. చట్టపరమైన హక్కు కోసమే మా పోరాటం. న్యాయం కోరుతున్నాం తప్ప బిచ్చం కాదు’ అని పేర్కొన్నారు.


కాగా, సుప్రీం తీర్పుపై రివ్యూ పిటిషన్‌ దాఖలు చేయమని సున్నీ వక్ఫ్‌ బోర్డు పేర్కొంది. వివాదాస్పద అయోధ్య స్థలంపై సుప్రీం తీర్పును స్వాగతిస్తూ సౌగరవంగా స్వీకరిస్తున్నట్లు ఉత్తరప్రదేశ్‌ సున్నీ సెంట్రల్‌ వక్ఫ్‌ బోర్డు ఛైర్మన్‌ జాఫర్‌ ఫరూకీ తెలిపారు. సుప్రీం తీర్పుపై ఉత్తరప్రదేశ్‌ సున్నీ సెంట్రల్‌ వక్ఫ్‌ బోర్డు ఎటువంటి రివ్యూ పిటిషన్‌ దాఖలు చేయబోవడం లేదని ఆయన పేర్కొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: