అమెరికాలో ఉద్యోగం చేయాల‌ని...ఇందుకు త‌గు అనుమ‌తుల‌తో వీసా పొందాల‌ని ఎంద‌రో భారతీయు క‌ల‌. అలా, క‌ల్పించిన ఓ వీసా కేట‌గిరీలో...మ‌న భార‌తీయుల వాటా 93%. అలాంటి కీల‌క వీసాల ప్ర‌క్రియ‌లో అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ‌ట్ ట్రంప్ షాకిస్తే....ఆ దేశ న్యాయ‌స్థానంలో ట్రంప్ మైండ్ బ్లాంక‌య్యే తీర్పిచ్చింది. త‌ద్వారా ఉప‌శ‌మ‌నం క‌ల్పించింది. ఇదంతా హెచ్‌4 వీసాల గురించి. 


2015లో అప్ప‌టి అధ్య‌క్షుడు బ‌రాక్ ఒబామా హెచ్-1బీ వీసా కలిగి ఉండి గ్రీన్‌కార్డు కోసం ప్రయత్నిస్తున్న విదేశీయుల జీవిత భాగస్వాములకు ఈ వీసాలు మంజూరు చేస్తూ, వారు అమెరికాలో ఉద్యోగాలు చేసుకునేందుకు అనుమతులు ఇచ్చారు. ఈ విధానం భారతీయులకు భారీ లబ్ధి చేకూర్చింది. అయితే డొనాల్డ్‌ ట్రంప్ అధికారంలోకి వచ్చాక ఈ అనుమతులను రద్దుచేశారు. ఈ నిర్ణ‌యం అనేక‌మంది భార‌తీయుల‌కు షాక్‌గా మారింది. దీంతో పలువురు న్యాయస్థానాలను ఆశ్రయించారు. 


ఇలా దాఖ‌లైన వ్యాజ్యాల విష‌యంలో యూఎస్ కోర్ట్స్ ఆఫ్ అప్పీల్స్ కొలంబియా సర్క్యూట్స్ విచారణ జరిగింది. ప్రభుత్వ నిర్ణయాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు త్రిసభ్య ధర్మాసనం ప్రకటించింది.ఈ కేసులో తీసుకున్న నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని దిగువ కోర్టుకు సూచించింది. దీంతో హెచ్-4 వీసాదారులకు పని అనుమతులను పునరుద్ధరించింది. దీంతో ఈ నిర్ణ‌యం వేలాదిమంది ఇండియ‌న్ల‌కు మేలు చేయ‌నుంది.


కాగా, అమెరికాలో హెచ్1బీ వీసాపై పనిచేసే విదేశీ నిపుణుల జీవిత భాగస్వాములకు పని అనుమతి కోసం హెచ్-4 వీసాల సౌల‌భ్యాన్ని క‌ల్పించడం ద్వారా 1.2 లక్షల మంది హెచ్-4 వీసాదారులు ఉద్యోగాలు చేస్తున్నట్టు అంచనా. ఈ వీసాల్లో భారతీయులకే అత్యధికంగా దక్కాయని ఒక నివేదిక వెల్లడించింది. హెచ్-4 వీసా పొందిన వారిలో ఐదింట ఒకవంతు మంది కాలిఫోర్నియాలోనే పనిచేస్తున్నట్టు తెలిపింది. హెచ్-4 వీసా కింద పనిచేసేందుకు అనుమతి పొందినవారిలో మహిళలే 93 శాతం మంది ఉన్నారని పేర్కొంది.



మరింత సమాచారం తెలుసుకోండి: